భార్యపై అనుమానం పెంచుకున్న తాగుబోతు భర్త అత్యంత దారుణంగా ఆమెను హతమార్చాడు. సెల్ ఫోన్ చార్జింగ్ వైర్ తో భార్యను హతమార్చిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.
మచిలీపట్నం : కంటికి రెప్పలా కాపాడతానని వేదమంత్రాల సాక్షిగా పెళ్ళాడినవాడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. చెడు వ్యసనాలకు భానిసైన మొగుడు కుటుంబపోషణ మరవడంతో ఆ భారం ఆ ఇల్లాలిపై పడింది. అయితే ఇలా పనిచేసుకుంటున్న భార్యపై అనుమానం పెంచుకున్న తాగుబోతు భర్త దారుణానికి ఒడిగట్టాడు. సెల్ ఫోన్ చార్జింగ్ వైర్ తో భార్యను అతి దారుణంగా హతమార్చాడు. ఈ అమానుష ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు, బాధిత కుటుంబం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలో కుమ్మమూరు గ్రామానికి చెందిన వీర్ల రామకృష్ఱ అదే గ్రామానికి చెందిన రమ్యతేజ భార్యాభర్తలు. ఒకరంటే ఒకరు ఇష్టపడి ప్రేమించుకున్న వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన కొన్నేళ్లు దంపతులు అన్యోన్యంగా వుండటంతో సంసారం సాఫీగా సాగింది. దీంతో వీరికి ఇద్దరు ఆడపిల్లలు సంతానం కలిగారు.
అయితే కొంతకాలంగా రామకృష్ణ తాగుడుకు బానిసయ్యాడు.ఇలా పనీపాట లేకుండా ఎప్పుడూ మద్యంమత్తులో వుంటూ భర్త కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో పోషణ భారం ఆ ఇల్లాలిపై పడింది. దీంతో రమ్యతేజ డ్వాక్రా గ్రూప్ బుక్ కీపర్ గా పనిచేయసాగింది. అయితే ఆమె సంపాదించిన డబ్బులు సైతం బలవంతంగా లాక్కుని తాగేవాడు రామకృష్ణ. ఈ విషయంలో భార్యాభర్తలకు మద్య గొడవలు జరగడంతో పుట్టింటివారితో కలిసి భర్తపై పోలీసులకు ఫిర్యాదుచేసింది.
Read More విశాఖలో మెడికో ఆత్మహత్య.. ప్రేమ వ్యవహారమే కారణం, పోలీసుల చేతికి వాట్సాప్ ఛాట్
కేసు పెట్టిందన్న కోపంతో పాటు భార్యపై అనుమానం ఎక్కువకావడంతో రామకృష్ణ దారుణానికి ఒడిగట్టాడు. శనివారం భార్యతో గొడవపడ్డ అతడు ఆవేశంలో విచక్షణ కోల్పోయాడు. సెల్ ఫోన్ చార్జింగ్ వైర్ ను భార్య గొంతుకు బిగించడంతో ఊపిరాడక ఆమె చనిపోయింది. ఇంటినుండి నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లిన రామకృష్ణ భార్యను చంపినట్లు తెలిపి లొంగిపోయాడు. దీంతో పోలీసులు అతడి ఇంటికి చేరుకోగా రమ్యతేజ మృతదేహం ఓ కుర్చీలో కనిపించడంతో కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.
భార్య రమ్యతేజను కిరాతకంగా చంపిన భర్తపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనతో కుమ్మలూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి.
