చంద్రబాబు కుటుంబంపై ఆత్మాహుతి దాడి హెచ్చరిక మావోయిస్టు అధికార ప్రతినిధి శ్యామ్ లేఖ చంద్రబాబుకు మరింత భద్రత పెంపు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు కుటుంబాన్ని మావోయిస్టులు లక్ష్యంగా చేసుకున్నారా? సోమవారం ఆంధ్ర ఒడిస్సా రాష్ట్రాల సరిహద్దుల్లో (ఏఒబి) భారీ ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఘటన వెలుగు చూసినప్పటి నుండి రకరకాల ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపధ్యంలోనే బుధవారం మావోయిస్టు పార్టీ ఏపి కమిటి అధికార ప్రతినిధి శ్యామ్ పేరుతో ఒక లేఖ విడుదలైంది.
అందులో చంద్రబాబును తేనెపూసిన కత్తిగాను, విశాఖ మారణకాండ ఫలితాన్ని త్వరలోనే అనుభవించక తప్పదని హెచ్చరికలు చేసారు. అందులోనే లోకేష్, చంద్రబాబు తమ నుండి తప్పించుకోలేరని, అవసరమైతే చంద్రబాబు కుటుంబంపై ఆత్మాహుతి దాడి కూడా చేస్తామని తీవ్రంగా హెచ్చరికలు అందటం గమనార్హం.
మోడి, చంద్రబాబుల కుట్ర ఫలితమే హత్యకాండ అని, రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుంటామంటూ లేఖలో శ్యామ్ పేర్కొన్నారు. అయితే, మావోయిస్టుల లేఖ నేపధ్యంలో చంద్రబాబుకు మరింత భద్రతను పెంచినట్లు సమాచారం.
కోవర్టు ద్వారా అన్నంలో విషం కలిపించి పడిపోయిన మావోయిస్టులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపినట్లు అధికార ప్రతినిధి ఆరోపించారు. మావోయిస్టులు ఎదుర్కొన్న అనేక తుఫానుల్లో ఇది పెద్దదని, అయితే నాలుగు రోజుల్లోనే తట్టుకుని నిలబడతామని ధీమా వ్యక్తం చేసారు. ప్రజాస్వామ్యం ముసుగులో ప్రభుత్వం హత్యలు చేయిస్తోందని ధ్వజమెత్తారు. కాగా, 2003లో తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళుతున్న సమయంలో అలిపిరి వద్ద చంద్రబాబుపై మావోయిస్టులు హత్యాయత్నం జరిపిన సంగతి అందరికీ తెలిసిందే.
