ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదిలోకి భారీగా వరద పోటెత్తుతోంది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో 20 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.

ఇన్‌ఫ్లో 4 లక్షల 60 వేల క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 3 లక్షల 77 వేల క్యూసెక్కులుగా వుంది. ప్రస్తుతం సాగర్‌లో నీటి మట్టం 589.80 అడుగులకు చేరింది.

ఓ వైపు జూరాల.. మరో వైపు తుంగభద్ర డ్యాం ల నుండి వరద పోటెత్తుతుండడంతో శ్రీశైలం డ్యాం వద్ద గేట్లన్నీ ఎత్తివేశారు. మొత్తం 10 గేట్లు 15 అడుగుల మేర ఎత్తి దిగువన నాగార్జునసాగర్ కు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం డ్యాంకు జూరాల నుండి 1 లక్షా 93 వేల క్యూసెక్కులు… తుంగభద్ర నుండి 68 వేల క్యూసెక్కులు చొప్పున వరద పోటెత్తుతుండగా.. డ్యాం వద్ద 2 లక్షల 8 వేల క్యూసెక్కులు నమోదు అవుతోంది. దీంతో డ్యాం గేట్లన్నీ ఎత్తి విడుదల చేస్తుండడంతో దాదాపు 4 లక్షల క్యూసెకకుల భారీ వరద నాగార్జునసాగర్ కు ఉరకలెత్తుతోంది.