అమరావతి: ఆయేషా మీరా హత్య మృతదేహానికి రీ పోస్టు మార్టం నిర్వహించాలని  సీబీఐ నిర్ణయం తీసుకొంది. ఆయేషా  మీరా మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఈ కేసులో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఆయేషా మీరా హత్య కేసులో దోషిగా పోలీసులు అరెస్ట్ చేసిన సత్యంబాబును రెండేళ్ల క్రితం హైకోర్టు నిర్ధోషిగా తేల్చింది. అయితే ఈ కేసుపై పునర్విచారణకు గత ప్రభుత్వం ఆదేశించింది. అయితే విచారణపై అసంతృప్తిని వ్యక్తం చేసిన హైకోర్టు... ఈ కేసు విచారణను సీబీఐకు అప్పగించింది.

అయేషా మీరా హత్య జరిగి సుమారు 12 ఏళ్లు అవుతోంది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2007 డిసెంబర్ 27వ తేదీన ఇబ్రహీంపట్నంలోని హాస్టల్‌లో అయేషా మీరా హత్యకు గురైంది.  అయేషా మీరా మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. మృతదేహం ఎముకలు మాత్రమే లభ్యమయ్యే అవకాశం ఉంది.

ఎన్ని ఏండ్లైనా ఎముకలు చెక్కు చెదరవు.  ఎక్కువగా విష ప్రయోగం ద్వారా మరణిస్తే మాత్రం విషం ఆనవాళ్లు మాత్రమే మృతదేహంలో ఆనవాళ్లను గుర్తించే అవకాశం ఉంటుందని ఫోరెన్సిక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఈ ఎముకలతో పాటు, జుట్టు, గోళ్లు కూడ ఏళ్ల తరబడి చెక్కు చెదరకుండా  ఉంటాయని  నిపుణులు చెబుతున్నారు. వీటి ఆధారంగా పరీక్షలను నిర్వహించే అవకాశం ఉందని  ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నారు. 

మృతదేహం కుళ్లిపోకుండా ఉన్న సమయంలో నిపుణులకు ఇబ్బంది ఉండదు. ఎముకలకు పరీక్షలు నిర్వహించి ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తోందని నిపుణులు చెబుతున్నారు.