అమరావతి: ఇంటి పట్టా లేదని ఎవరూ కూడ చేయి ఎత్తకూడదని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది జూలై 8వ తేదీన ఇళ్లపట్టాలను ఇవ్వనున్నట్టుగా చెప్పారు.

మంగళవారం నాడు సీఎం వైఎస్ జగన్ జిల్లా కలెక్టర్లు,ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో 29 లక్షలకు పైగా ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నామన్నారు.
అత్యంత ప్రాధాన్యతతో కూడిన కార్యక్రమంగా దీన్ని భావించాలని ఆయన అధికారులకు సూచించారు.

భూసేకరణ, పొజిషన్, ప్లాట్ల అభివృద్ధి మీద అధికారులు నిశితంగా పర్యవేక్షించాలని అధికారులకు సీఎం కోరారు. నూటికి నూరు శాతం ఇళ్లపట్టాలు పంపిణీ కావాలన్నారు.80 శాతం అయ్యిందని, 85 శాతం అయ్యిందని, 90 శాతం అయ్యిందని చెబితే అంగీకరించేది లేదని జగన్ హెచ్చరించారు.

నూటికి నూరు శాతం కచ్చితంగా ఇళ్ల పట్టాలు పంపిణీ కావాలన్న విషయాన్ని పదే పదే గుర్తుంచుకోవాలన్నారు. ప్లాట్ల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియ వెంటనే పూర్తి కావాలన్నారు. ఇళ్లపట్టాల లబ్ధిదారుల తుది జాబితా గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలన్నారు.

also read:తెలంగాణ బాటలోనే ఏపీ: మరో 12 జిల్లాల ఏర్పాటుకు సర్కార్ కసరత్తు

కరోనా పరిస్థితులు తగ్గిన తర్వాత గ్రామాల్లో తాను పర్యటించనున్నట్టుగా సీఎం జగన్ చెప్పారు.పూర్తి పారదర్శకంగా, ప్రభావవంతంగా ఇళ్లపట్టాలను పంపిణీ చేయాలని ఆయన సూచించారు.

సరైన కారణంగా లేకుండా ఎవరికైనా ఇంటి పట్టా రాలేదంటే అధికారులను బాధ్యులను చేస్తామని ఆయన చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టా రావాలన్నారు.

పెన్షన్‌ కార్డు 10 రోజులు, రేషన్‌ కార్డు కూడా 10 రోజులు, ఆరోగ్యశ్రీ కార్డు 20 రోజులు, ఇంటిపట్టా 90 రోజుల్లో గ్రామ సచివాలయాల ద్వారా అందాలని సీఎం సూచించారు.  ఈ గడువులోగా అందించేలా వ్యవస్థలను తయారు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని చెప్పారు.