తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. విజయనగరం జిల్లాలో వర్షాల కారణంగా ఓ ఇల్లు కూలి ఇద్దరు మృత్యువాతపడ్డారు.
విజయనగరం : తెలుగురాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. వరద నీటితో వాగులు వంకలు పొగిపొర్లుతున్నాయి. అలాగే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇళ్లు కుప్పకూలుతున్నాయి. ఇలా వర్షాలకు గోడకూలి తెలంగాణలోని నల్గొండ పట్టణంలో తల్లీకూతురు మృతిచెందిన ఘటన మరువకముందే తాజాగా ఏపీలో ఇలాంటి దుర్ఘటనే చోటుచేసుకుంది. ఇంటి గోడ కూలి పైన పడటంతో ఓ చిన్నారితో పాటు మహిళ మృతిచెందింది.
వివరాల్లోకి వెళితే... గత రెండ్రోజులుగా విజయనగరం జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో గరివిడి మండలం కుమరాం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గత రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి గ్రామంలోని ఓ ఇంటి గొడ దెబ్బతింది. ఈ క్రమంలోనే అర్ధరాత్రి మూడుగంటల సమయంలో ఇంట్లోనివారు గాడనిద్రలో వుండగా ఒక్కసారిగా గోడ కుప్పకూలింది. దీంతో శిథిలాలు మీదపడటంతో ఆరేళ్ళ చిన్నారి అడ్డాల హరిషిత్ వర్మ (6)తో పాటు అడ్డాల లక్ష్మి (48) మృతిచెందారు. మరో ముగ్గురు కుటుంబసభ్యులు తీవ్రంగా గాయపడ్డారు.
read more విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి.. ప్రమాదానికి గురైన కారులో గంజాయి ప్యాకెట్లు
ఇంటి గోడ కూలినవెంటనే చుట్టుపక్కల ఇళ్లవారు, గ్రామస్తులు సహాయక చర్యలు ప్రారంభించారు. తీవ్ర గాయాలతో శిథిలాల కింద చిక్కుకున్నవారిని కాపాడి దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. అనంతరం శిథిలాలను తొలగించి చిన్నారి, మహిళ మృతదేహాన్ని కూడా బయటకుతీసారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మహిళ, చిన్నారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇలా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఓ కుటుంబంలో విషాదాన్ని నింపాయి.
ఇక తెలంగాణలోనూ ఇలాంటి దుర్ఘటనే చోటుచేసుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. నల్గొండ జిల్లాలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి ఇంటిగోడ కూలి తల్లీకూతురు మృతిచెందారు.
ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఉపాధి కోసం నల్గొండకు వలసవచ్చి పద్మానగర్ లో నివాసముంటున్నారు. కొన్నేళ్లుగా ఇక్కడే రైల్వే కూలీలకు వంటచేసిపెడుతూ తద్వారా వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇలా భార్యాభర్తలు కష్టపడి పనిచేస్తూ ఇటీవలే కూతురు పెళ్లి చేసారు.
అయితే కూతురు కళ్యాణి (21) పుట్టింటికి రావడంతో తల్లి నడికుడి లక్ష్మీ (42) ఇంట్లోనే వుంది. రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో ఇంట్లో పడుకునివున్న తల్లీకూతుళ్లు ప్రమాదానికి గురయ్యారు. వర్షపు నీటితో ఇంటి గోడ బాగా తడిసి ఇవాళ తెల్లవారుజామున ఒక్కసారిగా బీరువాపై కుప్పకూలింది. దీంతో బీరువా ఇంట్లో పడుకున్న తల్లీకూతుళ్లపై పడటంతో దుర్మరణం చెందారు.
