విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.దత్తరాజేరు మండలం షికారుగంజిలో  నిర్మాణంలో ఉన్న కల్వర్టును కారు ఢీకొట్టడంతో  ముగ్గురు మృతిచెందారు.

విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.దత్తరాజేరు మండలం షికారుగంజిలో నిర్మాణంలో ఉన్న కల్వర్టును కారు ఢీకొట్టడంతో ముగ్గురు మృతిచెందారు. కారు ఒడిశా నుంచి విజయనగరం వైపు వెళ్తుంది. అయితే షికారుగంజి కూడలి వద్ద నిర్మాణంలో ఉన్న కల్వర్ట్‌ను ఢీకొట్టి రోడ్డు పక్కనే ఉన్న గొయ్యిలోకి బోల్తాపడింది. దీంతో కారులోని ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలతో ఉన్న కారును జేసీబీ సహాయంతో బయటికి తీశారు. అయితే కారులో గంజాయి ప్యాకెట్లు గుర్తించినట్టుగా తెలుస్తోంది. 

ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు సేకరిస్తున్నారు. మృతులు గంజాయిని ఎక్కడికి తరలిస్తున్నారనే కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇక, నిర్మాణంలో ఉన్న కల్వర్టును గుర్తించకపోవడం, కారు అతివేగంతో ఉండటమే ప్రమాదానికి కారణంగా అనుమానిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.