అమరావతి ప్రాంతంలో శాంతి భద్రతలకు భంగం కలిగించాలన్నదే టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ప్లాన్‌ అని... అందుకోసమే నక్క జిత్తులను ప్రయోగిస్తున్నారని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. మూడు రాజధానులకు మద్దుతుగా కార్యక్రమాలు చేస్తున్న వారి వైపుగా వెళ్లాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని... తద్వారా ఘర్షణలు జరగాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలన్నది చంద్రబాబు ఉద్దేశమని సుచరిత ఆరోపించారు. 

''తుళ్లూరులో సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు. చంద్రబాబు కాన్వాయ్‌ రూట్‌ను కూడా పోలీసులకు ఇచ్చారు. ఆ రూట్లో పోలీసులు అన్నిరకాలుగా నిన్ననే భద్రతా ఏర్పాట్లు చేసుకున్నారు. సడెన్‌ గా చంద్రబాబు తన రూట్‌ను మార్చుకుని వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలా చేసి ఘర్షణ వాతావరణాన్ని స్రుష్టిస్తున్నారు'' అని సుచరిత పేర్కొన్నారు. 

''ఈ రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితులు ఉండకూడదని చంద్రబాబు కంకణం కట్టుకున్నారు.ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలను అందరూ ఖండించాలి. చంద్రబాబు ముందు తన విషపు ఆలోచనలను విడిచిపెట్టాలి.శాంతిభద్రతలను కాపాడటంలో పోలీసులకు సహకరించాలి'' అని సుచరిత సూచించారు. 

read more  జనవరి లోపు... రాజధాని రైతులకు తీపి కబురు: మాజీ మంత్రి శోభనాద్రీశ్వరరావు

రాజధాని రైతుల ఆందోళనలు ఏడాదికి చేరిన నేపథ్యంలో జనభేరి పేరుతో రైతులు, జేఏసి భారీ సభను నిర్వహిస్తోంది. ఈ  సభలో పాల్గొనడానికి ప్రతిపక్ష నాయకులు, మాజీ ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు వెళ్ళాల్సిన రూట్ మ్యాప్ ను చివరి నిమిషాల్లో పోలీసులు మార్చారు. ఉద్దండరాయుని పాలెం మీదుగా జనభేరి సభకు వెళతానంటూ చంద్రబాబు కోరిన రూట్ మ్యాప్ కు అనుమతి నిరాకరించారు పోలీసులు.  దుర్గ గుడి, ఉండవల్లి సెంటర్,పెనుమాక, కృష్ణాయపాలెం, మందడం, వెలగపూడి, రాయపూడి సభకు వెళ్లేలని పోలీసులే ఓ రూట్ మ్యాప్ ను చంద్రబాబు కు సూచించారు. 

 ఈ క్రమంలోనే అమరావతి శంకుస్థాపన ప్రాంతానికి  వెళ్ళ కుండా చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. టిడిపి నాయకులు, కార్యకర్తలతో కాకుండా ఒంటరిగా అయినా శంకుస్థాపన స్థలానికి వెళతానని చంద్రబాబు కోరినా పోలీసులు అనుమతించడంలేదు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.