మొత్తంమీద ఇప్పటికి సుమారు 13 లక్షల కోళ్లు మృతి చెందినట్లు పౌల్ట్రీ వర్గాల అంచనా . సుమారుగా రూ.19.50 కోట్లు రైతులకు నష్టం వాటిల్లింది.
పెరుగుతున్న ఉష్ణోగ్రతల ధాటికి కోళ్లు పిట్టలా రాలిపోతున్నాయి. ఎవరూ ముట్టుకోకుండానే హరీ మంటున్నాయి. రాష్ట్రంలోని చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. దీనికి గాలిలో తేమశాతం తోడవడంతో 59 డిగ్రీల ప్రభావాన్ని కనబడుతోంది. ఆ ఉష్ణోగ్రతలనే కోళ్ళు తట్టుకోలేకపోతున్నాయి. సాధారణంగా కోళ్ళు అత్యధికంగా 42 డిగ్రీలను మాత్రమే తట్టుకుంటాయి.
ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ వాటికి ప్రాణాపాయమే. అందుకే పలుచోట్ల షెడ్ల యజమానులు షెడ్లపైన, చుట్టూతా గోతాలు కప్పుతున్నారు. వాటిపై గంటగంటకు నీరు చల్లతున్నారు. స్తోమత ఉన్న వారు స్ప్రేయర్లు ఏర్పాటు కూడా చేసారు. అయినా అధిక ఉష్ణోగ్రతల్ని తట్టుకోలేకపోతున్నాయ్.
ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడం కోళ్లపై తీవ్ర ప్రభావం పడింది. వడదెబ్బకు గురై గంటల వ్యవధిలోనే కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలతోపాటు కృష్ణా జిల్లాలో కూడా ప్రభావం ఎక్కువగా కనబడుతోంది. మొత్తంమీద ఇప్పటికి సుమారు 13 లక్షల కోళ్లు మృతి చెందినట్లు పౌల్ట్రీ వర్గాల అంచనా . సుమారుగా రూ.19.50 కోట్లు రైతులకు నష్టం వాటిల్లింది.
మండుతున్న ఎండలకు మాంసం వినియోగం తగ్గినా ధరలు మాత్రం పెరిగుతుండటం గమనార్హం. వారం కిందట కిలో రూ.160 ఉండగా ఇప్పుడు రూ.230కి చేరింది. లక్షలాది కోళ్లు చనిపోవడంతోపాటు వాటి ఎదుగుదల కూడా తగ్గిపోవడమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. సాధారణంగా కోడి 45 రోజులకు 2 కిలోలు బరువు పెరుగుతుంది. కానీ ఎండల వల్ల 60 రోజులకు బరువు పెరుగుతోంది. అందుకే మాంసం ధర పెరుగుతోంది. దానికితోడు వేసవి తీవ్రత మొదలయ్యాక గుడ్ల దిగుబడి కూడా 20శాతం తగ్గింది. ఉష్ణోగ్రతలు ఇలానే ఉంటే ఇంకెన్ని లక్షల కోళ్ళు చనిపోతాయో?
