జయకు జరిగిన చికిత్సపై కేంద్రానికి సమాచారం ఉన్నా ఎందుకు మౌనం, గోప్యత పాటిస్తోందో అర్ధం కావటం లేదని న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేసారు.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై చెన్నై హైకోర్టు విచారణకు ఆదేశించింది. ఇంత కాలం ‘అమ్మ’ మరణంపై పలువురిలో ఉన్న అనుమానాలు త్వరలో వెల్లడయ్యేందుకు మార్గం సుగమం అయింది. ఓ పిటిషన్ ఆధారంగా న్యాయస్ధానం జయ మిస్టరీని ఛేదించేందుకు పూనుకుంది.
మృతిచెందిన తర్వాతైనా జయ మరణానికి దారితీసిన కారణాలను తెలుసుకోవటం తప్పు కాదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఆమె మరణంపై తమకు కూడా అనేక అనుమానాలున్నట్లు వ్యాఖ్యానించటం గమనార్హం.
కేసును విచారిస్తున్న జస్టిస్ వైద్యనాధన్ మాట్లాడుతూ, జయ మృతిపై మీడియా కూడా అనుమానాలను వెలిబుచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. అందరికీ అనుమానాలున్న నేపధ్యంలో జయ మృతదేహాన్ని మళ్ళీ పరీక్షించాలని ఎందుకు ఆదేశించకూడదని వైద్యనాధన్ ప్రశ్నించారు.
ఆసుపత్రిలో చేరినపుడు బాగానే ఆహారం తీసుకుంటున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం చేసిన ప్రకటనను కోర్టు ప్రస్తావించింది. విచారణ నిమ్మితం కేసును న్యాయమూర్తి రెగ్యుల్ బెంచ్ కు బదిలీచేసారు. న్యాయమూర్తి వ్యాఖ్యలతో తమిళనాడులో సర్వత్రా తీవ్ర కలకలం మొదలైంది.
జయ మరణంపై అందరికీ అనేక అనుమానాలున్నప్పటికీ ఎవరూ ధైర్యంగా నోరు మెదపలేదు.
జయకు జరిగిన చికిత్సపై కేంద్రానికి సమాచారం ఉన్నా ఎందుకు మౌనం, గోప్యత పాటిస్తోందో అర్ధం కావటం లేదని న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేసారు. ఈ విషయమై జనవరి 9వ తేదీలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హై కోర్టు ఆదేశాలను జారీ చేసింది.
9వ తేదీలోగా సమగ్ర నివేదిక అందచేయకపోతే రీ పోస్టుమార్టెంకు ఆదేశించాల్సి వస్తుందని హెచ్చరించారు. తానొక్కడినే కేసును విచారించాల్సి వస్తే పరిస్ధితి మరోవిధంగా ఉంటుందని కూడా వైద్యనాధన్ తీవ్రంగా చెప్పటం గమనార్హం.
