అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని అమరావతి నుండి మరో రెండు ప్రాంతాలకు తరలించాలన్న వైసిపి ప్రభుత్వం నిర్ణయంపై దాఖలయిన మొత్తం పిటిషన్లపై హైకోర్టు సోమవారం విచారణ జరపనుంది. కేవలం రాజధాని అంశాలపై దాఖలైన సుమారు 100కు పైగా పిటిషన్ల విషయంలో కీలన న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ పిటిషన్లను ఎప్పటి నుంచి రోజువారి విచారణ జరపాలో నిర్ణయం తీసుకొనే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 

రాజధాని వివాదంపై అమరావతి రైతులు, న్యాయవాదులు, ప్రజా ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. అలాగే విశాఖలో గెస్ట్ హౌజ్ నిర్మాణంపై సీఎస్ ను కౌంటర్ ధాఖలు చేయమని గతంలో ధర్మాసనం ఆదేశించింది. రాజధాని నుంచి కార్యాలయాల తరలింపు, హైకోర్టుకు శాశ్వత భవన నిర్మాణం, సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. ఆర్-5 జోన్ పిటిషన్ తో పాటు పలు అంశాలపై దాఖలైన పిటిషన్ల విచారణపై ఇవాళ హైకోర్టు ఓ నిర్ణయం తీసుకోనుంది. 

read more మూడు రాజధానులకు నో: అమరావతికి అనుకూలంగా హైకోర్టులో కాంగ్రెస్ అఫిడవిట్

గతంలో రాజధానికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు కీలక నిర్ణయాన్ని వెలువరించింది. ఈ విచారణను అక్టోబర్‌ 5కు వాయిదా వేసిన న్యాయస్థానం ప్రస్తుతం రాజధానిపై ఉన్న స్టేటస్‌కో ను కూడా అప్పటివరకు (అక్టోబర్‌ 5) పొడిగిస్తున్నట్లు ఆదేశించింది. అక్టోబర్‌ 5 నుంచి రాజధాని విషయంపై దాఖలైన పిటిషన్లపై రోజువారీ విచారణ చేపడామని హైకోర్టు పేర్కొంది. 

జగన్ సర్కార్ ఆగస్ట్ 16వ తేదీన విశాఖలో కార్యనిర్వాహక రాజధానికి శంకుస్థాపన చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసారు. ఇందుకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వానం సైతం పంపారు. నేరుగా రావడానికి కుదరకపోతే కనీసం వర్చువల్ గా అయినా శంకుస్థాపన చేయాలని కోరారు. కానీ ఏమైందో ఏమో కానీ ఉన్నట్టుండి ముహుర్తాన్ని దసరాకి వాయిదా వేశారు. ప్రధాని అపాయింట్మెంట్ కుదరక అని చెప్పినప్పటికీ... న్యాయస్థానాలు తీసుకునే నిర్ణయాలు అనుకూలిస్తాయో లేవో అనే ఒక అనుమానం కూడా జగన్ సర్కార్ మనసులో ఉండే వాయిదా వేసినట్టుగా వార్తలు వచ్చాయి. 

మరోపక్క జగన్ సర్కార్ సాధ్యమైనంత త్వరగా కోర్టులో ఈ విషయానికి శుభం కార్డు వేసేందుకు ప్రణాళికలను రచిస్తోంది. రైతులకు అమరావతిలో ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేసి ఇస్తామో చెప్పే ఒక ప్లాన్ ను రూపొందిస్తుంది. అభివృద్ధి ఎలా చేయబోతున్నామో చెబుతూ... ఈ పూర్తి విషయాన్నీ కోర్టు ముందు ప్రభుత్వం  ఉంచాలనుకుంటుందని సమాచారం.

ఇలా కోర్టుకు సమర్పించడం ద్వారా మౌలికంగా రైతులు తమకు అన్యాయం జరిగిందని చెబుతున్న వాదనకు....  ప్రభుత్వం ఈ ప్లాన్ ద్వారా వారికి నష్టం కలగకుండా చూస్తామని కోర్టుకు చెప్పొచ్చని భావిస్తోంది. కోర్టు గనుక ప్రభుత్వ వాదనకు అంగీకరిస్తే ఈ వివాదానికి శుభం కార్డు వేయొచ్చు అని భావిస్తుంది.