బైరెడ్డి సిద్దార్థ్ అనుచరుడి ఇంట్లో భారీగా నాటుబాంబులు... నంద్యాలలో కలకలం
నంద్యాల జిల్లాలో ఓ వైసిపి నాయకుడి ఇంట్లో భారీగా నాటుబాంబులు బయటపడటం కలకలం రేపుతోంది.

నంద్యాల : ఏపీ శాప్ ఛైర్మన్, వైసిపి యువ నాయకుడు బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి అనుచరుడి ఇంట్లో భారీగా నాటుబాంబుల కలకలం రేపుతున్నాయి. వైసిపి సోషల్ మీడియా కన్వీనర్ బోయ మధు ఇంటిపైన నీటి ట్యాంకులో రెండు కవర్లలో చుట్టిన 22 నాటుబాంబులు బయటపడ్డాయి. దీంతో వెంటనే పోలీసులు నాటుబాంబులను స్వాధీనం చేసుకుని అవి ఎవరు దాచారు? ఎందుకు దాచారు? అన్నదానిపై దర్యాప్తు చేపట్టారు.
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం కొత్త ముచ్చుమర్రి బోయ మధు స్వగ్రామం. గ్రామంలోని అతడి ఇంటిపై గల నీటి ట్యాంక్ ను క్లీన్ చేస్తుండగా కవర్లలో చుట్టిపెట్టిన గుండ్రని వస్తువులేవో గుర్తించారు. వాటిని ట్యాంక్ లోంచి బయటకు తీసి చూడగా నాటుబాంబులు వున్నాయి. దీంతో ఇంటి యజమాని మధుతో పాటు కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. వెంటనే మధు పోలీసులకు ఫిర్యాదు చేసారు.
వైసిపి నేత మధు ఇంటికి చేరుకున్న పోలీసులు నాటుబాంబులను పరిశీలించారు. వెంటనే వాటిని స్వాదీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి వాటర్ ట్యాంకులో నాటుబాంబులు దాచిందెవరో గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.