గుడివాడ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం: గుండెపోటుతో వచ్చిన రోగి మృతి
గుండెపోటుతో చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన రోగికి వైద్యం అందించడంలో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహారించారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే ఇందుకు కారణమని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది.
విజయవాడ: గుండెపోటుతో చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన రోగికి వైద్యం అందించడంలో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహారించడంతో రోగి మృతి చెందాడు. ఈ విషయమై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఇదిలా ఉంటే ఈ విషయమై అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు.
గుండెపోటు వచ్చిన హరిప్రసాద్ అనే వ్యక్తిని కుటుంబ సభ్యులు నిన్న గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకు వచ్చారు. ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద రిపేర్ చేస్తున్నందున ప్రదాన ద్వారానికి అడ్డంగా రాడ్ పెట్టారు. వెనుక గేటు నుండి రోగిని ఆసుపత్రి లోపలికి తీసుకు రావాలని సూచించారు. వెనుక గేటు వైపునకు హరిప్రసాద్ ను కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. వెనుక గేటుకు కూడ తాళం వేసి ఉంది. దీంతో హరిప్రసాద్ ను కుటుంబ సభ్యులు మళ్లీ మెయిన్ గేటు వద్దకు తీసుకు వచ్చారు. వెనుక గేటు మూసి ఉన్న విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది దృష్టికి తీసుకు వచ్చారు.
దీంతో ఆసుప్రతి ప్రధాన గేటు వద్ద అడ్డంగా ఉన్న రాడ్ ను తొలగించి హరిప్రసాద్ ను ఆసుపత్రిలోకి తీసుకువెళ్లారు. హరిప్రసాద్ ను ఆసుపత్రిలోకి వెళ్లడానికి అరగంట పాటు సమయం వృధా అయింది. హరిప్రసాద్ కు వైద్యం చేస్తున్న సమయంలో ఆయన మృతి చెందాడు. గుండెపోటు వచ్చిన సమయంలో ప్రతి క్షణం విలువైంది. కానీ ఈ విషయాన్ని పట్టించుకోకుండా అరగంట పాటు ఆలస్యంచేయడంతో హరిప్రసాద్ మరణానికి ఆసుపత్రి సిబ్బంది కారణమని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హరిప్రసాద్ ను ప్రధాన ద్వారం నుండి వెనుక ద్వారం వరకు అక్కడి నుండి మెయిన్ ద్వారం వరకు భుజాలపైనే తాము తీసుకెళ్లినట్టుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కనీసం స్ట్రెచర్ కూడ ఇవ్వలేదని వారు ఆరోపిస్తున్నారు.
హరిప్రసాద్ మృతికి కారణమైన ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు మృతుడి కుటుంబ సభ్యులు. ఇదిలా ఉంటే ఈ విషయమై వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు. హరిప్రసాద్ మృతికి వైద్య ఆరోగ్య సిబ్బంది కారణమా, ఇతరత్రాల కారణాలున్నాయా అనే విషయమై విచారణ చేస్తున్నారు.