Asianet News TeluguAsianet News Telugu

అయినా ఫరవాలేదనే పవన్ కల్యాణ్ ను కలిశాం: హరిరామ జోగయ్య

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను తాము ఇంత వరకు ఎందుకు కలుసుకోలేదో మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య చెప్పారు. కులం ముద్ర పడుతుందనే తాము పవన్ కల్యాణ్ ను కలువలేదని ఆయన చెప్పారు.

Harirama jogaiah meets Jana Sena chief Pawan Kalyan
Author
Amaravathi, First Published Jan 30, 2021, 9:47 AM IST

అమరావతి: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తో భేటీ తర్వాత కాపు సంక్షేమ సేన జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య మీడియాతో మాట్లాడారు.  “కాపు సంక్షేమ సేన ఏ పార్టీకి సంబంధించిన సంస్థ కాదు. మేము ఏ నాయకుడికీ అనుయాయులం కాదు. కాపుల అభ్యున్నతి కోసం, ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న డిమాండ్ల పరిష్కారం కోసం కాపు సంక్షేమ సేన ఏర్పాటు చేశాం. మా డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచాం” అని ఆయన అన్నారు. 

ముఖ్యమంత్రికి, అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాశామని, కేవలం ఒక్క జనసేన పార్టీకి మాత్రమే కుల ముద్ర ఎక్కడ పడుతుందోనన్న భయంతో ఇన్నాళ్లు దూరంగా ఉన్నామని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ కలగచేసుకుంటేనేగానీ డిమాండ్స్ సాధించలేమన్న నిర్ణయానికి వచ్చామని ఆయన అన్నారు. కాపు ముద్ర పడినా పర్వాలేదని తమకు న్యాయం జరిగితే చాలు అన్న ఉద్దేశంతో తమ సమస్యలు మీ దృష్టికి తీసుకువచ్చామని చెప్పారు. 

Also Read: కులం అంటగడుతారనే భయం లేదు: పవన్ కల్యాణ్ కాపు ఎజెండా

తమ డిమాండ్లు పరిశీలించి కాపులకు న్యాయం చేయమని ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కోరుతున్నట్లు ఆయన తెలిపారు.  ఒక పేద కులం, అన్ని రకాలుగా వెనుకబడి ఉన్న కులం కోరికగా ప్రభుత్వం ముందు ఉంచాలని,  తాము ఇతర కులాల ప్రయోజనాలు కాపాడుతూ మాడిమాండ్లు పరిష్కారం అయ్యేలా చూడాలని ఆయన పవన్ కల్యాణ్ ను కోరారు. తాము ఏ ఒక్క కులానికీ వ్యతిరేకం కాదని హరిరామ జోగయ్య స్పష్టం చేశారు. 

రాజకీయంగా సైతం కాపులను అణగదొక్కుతున్నారని ఆయన చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో కనీసం ఒక్క కాపుకి కూడా అవకాశం ఇవ్వకపోవడమే అందుకు నిదర్శనమని అన్నారు. కాపుల్ని కేవలం రాజకీయ లబ్ది కోసం ఉపయోగించుకోవడం మినహా ఎవ్వరూ తమకు ఉపయోగపడలేదని ఆయన అన్నారు. 

పవన్ కల్యాణ్ తో జరిగిన సమావేశంలో కాపు సంక్షేమ సేన గౌరవ అధ్యక్షుడు డా.యిర్రింకి సూర్యారావు, కన్వీనర్ చందు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సత్యశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios