Asianet News TeluguAsianet News Telugu

కులం అంటగడుతారనే భయం లేదు: పవన్ కల్యాణ్ కాపు ఎజెండా

కాపు సామాజికవర్గం డిమాండ్ చేస్తున్న రిజర్వేషన్లపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్పష్టత ఇచ్చారు. తనకు కులం అంటగడుతారనే భయం లేదని, కాపుల గురించి మాట్లాడుతానని పవన్ కల్యాణ్ అన్నారు.

Jana Sena chief Pawan Kalyan says Kapus should capture the power
Author
Amaravathi, First Published Jan 30, 2021, 9:20 AM IST

అమరావతి: కాపులతోపాటు ఆర్థికంగా, సామాజికంగా అణగారిన అన్ని వర్గాలు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. 1930 నుంచే కాపు కులంలో విభజించు, పాలించు సిద్ధాంతం మొదలయ్యిందని, అది ఈ రోజుకీ కొనసాగుతోందన్నారు. కాపులకు రాజకీయ సాధికారిత వచ్చిన రోజు... మిగిలిన అన్ని వెనుకబడిన కులాలకు విముక్తి లభిస్తుందని చెప్పారు. బీసీ కులాలకు ఇబ్బంది లేకుండా కాపుల న్యాయమైన డిమాండ్లను జనసేన పార్టీ బలంగా ముందుకు తీసుకెళ్తుందన్నారు.  

కాపులు ఎదుర్కొంటున్న సమస్యలు, కాపు రిజర్వేషన్ అంశాలపై కాపు సంక్షేమ సేన ప్రతినిధులు పవన్ కళ్యాణ్ ను మంగళగిరి పార్టీ కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. కాపు సంక్షేమ సేన అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య నేతృత్వంలోని బృందంతో సమావేశమయ్యారు.  

అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ "కులం అనేది మనం ఎంచుకునేది కాదు. మన ప్రమేయం లేకుండా మనం పుట్టింది. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు రెల్లి కులంవారి అవస్థలు చూసి అట్టడుగు వర్గాల వారికి అండగా ఉండాలని రెల్లి కులాన్ని స్వీకరించాను" అని ఆయన అన్నారు..

పొలిటికల్, సోషల్ ఫిలాసఫీని సంపూర్ణంగా అధ్యయనం చేసి రాజకీయాల్లోకి వచ్చానని, ఏదైనా మాట మాట్లాడితే కులం అంటగట్టేస్తారనే భయం తనకు లేదని పవన్ కల్యాణ్ అన్నారు.  ప్రతి కులం ప్రతినిధులు తన దగ్గరకు వచ్చి వారి సమస్యలు చెప్పుకొన్నప్పుడు.. తాను పుట్టిన కులం తన దగ్గరకు వచ్చి సమస్యలను విన్నవించుకోవడం తప్పేమి కాదని ఆయన అన్నారు. దానికి కులం అంటగడతారనే భయం అవసరం లేదని అన్నారు. తన మనసు, ఆలోచన ప్రజలకు తెలుసునని అన్నారు. తాను అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలకు చెందనివాడిని అని అన్నారు. ప్రతి కులంలో వెనకబాటు తనం గురించి మాట్లాడటానికి ఏ మాత్రం సంకోచించనని అన్నారు.

Jana Sena chief Pawan Kalyan says Kapus should capture the power

దామోదరం సంజీవయ్య  గుర్తుంచుకోవాలి 

1891 సంవత్సరంలో బ్రిటీష్ ప్రభుత్వం కులాల ఆధారంగా జనాభా లెక్కలు మొదలు పెట్టడంతో ఈ రిజర్వేషన్ల ప్రక్రియ మొదలయ్యిందని పవన్ కల్యాణ్ చెప్పారు. రాజ్యాంగం ఏర్పడి, మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయే వరకు కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలు బీసీల్లోనే ఉండేవని గుర్తు చేశారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నీలం సంజీవరెడ్డి  కులాలను బీసీ జాబితా నుంచి తప్పించారని అన్నారు. తర్వాత దామోదరం సంజీవయ్య  రిజర్వేషన్లు పునరుద్దరించారని చెప్పారు. 

కాపులు దళితవర్గం నుంచి వచ్చిన గొప్ప నేత, ముఖ్యమంత్రిగా చేసిన దామోదరం సంజీవయ్య గారిని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. ఆ తరవాత  కొన్ని రాజకీయ శక్తుల కుయుక్తుల వల్ల బీసీ రిజర్వేషన్ కొనసాగలేదని అన్నారు.  ఈ సమయంలోనే కాపు కులంలో విభజించు, పాలించు అనే సిద్ధాంతం మొదలైందని అన్నారు. అది ఈ రోజుకి కొనసాగుతూనే ఉందని చెప్పారు. తూర్పు కాపులు,  మున్నూరు కాపులు అని విడదీశారని, ఇప్పటికీ విడదీస్తూనే ఉన్నారు. కాపు రిజర్వేషన్ అంశాన్ని ఎవరూ ఇప్పటి వరకు ముందుకు తీసుకెళ్లలేకపోయారని అన్నారు. 

టీడీపీ అధ్యక్,ుడు చంద్రబాబు కాపులు ఓసీలా, బీసీలా అనే మీమాంసలో పడేస్తే.. జగన్ రెడ్డి కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం కుదరదని చెప్పేశారని అన్నారు. ముందుగా కాపుల్లో చలనం వచ్చి, మథనం జరిగితే తప్ప రిజర్వేషన్ అంశాన్ని ముందుకు తీసుకెళ్లలేమని అన్నారు.

అట్టడుగు వర్గాలను నలిపేస్తున్నారు

తనకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తుల్లో రామ్ మనోహర్ లోహియా గారు ఒకరని, ఆయన్ను అపారంగా గౌరవిస్తానని, ఆయన రాసిన భారతదేశంలో కులాలు అనే పుస్తకం తనను బలంగా హత్తుకుందని పవన్ కల్యాణ్ చెప్పారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కులాలకు  వెనకబాటుతనం, కాపుల గురించి ఆయన ప్రస్తావించిన విధానం, మిగతా కులాలను కలుపుకొని ఎలా ముందుకు వెళ్లాలని ఆయన చెప్పిన విధానం తనను లోతుగా అధ్యయనం చేసేలా చేసిందని అన్నారు.
 
రాజకీయంగా శాసించే శక్తులు, చట్టాలను చేతుల్లోకి తీసుకున్న కొంతమంది వ్యక్తులు అట్టడుగు వర్గాలను నలిపేస్తున్నారని విమర్శించారు. కాపులకు సాధికారిత వచ్చిన రోజున దళితులు, బీసీలు మిగత వెనుకబడిన కులాలకు వీళ్లందరి నుంచి విముక్తి లభిస్తుందని లోహియా ఆ పుస్తకంలో రాశారని ఆయన గుర్తు చేశారు. 

కాపుల్లో 80 శాతం మంది దుర్భర స్థితిలో ఉన్నారు 

తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ ను అమలు చేస్తుంటే ఇక్కడ మాత్రం తీసేశారని అన్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, హరిరామ జోగయ్య వంటి కొంతమంది వ్యక్తులను చూసి ఆ కులానికి రిజర్వేషన్ అవసరం లేదనుకున్నారేమోనని అన్నారు. కాపు కులంలో 15 నుంచి 20 శాతం మందిని పక్కన పెడితే 80 శాతం మంది దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్నారని అన్నారు. కాపులు బలపడకూడదని తూర్పు కాపులుగా, తెలంగాణలో మున్నూరు కాపులుగా కొన్ని దశాబ్దాల కిందటే విడదీశారని అన్నారు. కాపు, ఒంటరి, బలిజ కులాల మధ్య తగదాలు పెట్టారని ఆయన అన్నారు.

రాజకీయ శక్తులు నిరంతరంగా  చేస్తున్న దాడులను అందరూ గుర్తించాలని,  బలమైన ఐక్యత తీసుకొచ్చే ప్రక్రియ జరగాలి. ఏడు దశాబ్దాల నుంచి పోరాటం చేస్తున్న ఎందుకు వెనకబడిపోయామో కాపుల్లో ఆత్మపరిశీలన జరగాలని పవన్ కల్యాణ్ అన్నారు. రాజ్యాధికారాన్ని చేజిక్కుంచుకునే బలమైన సమూహం ఉండి కూడా రాజ్యాధికారాన్ని శాసించే కొన్ని శక్తులకు ముడిసరుకుగా ఉపయోగపడుతున్నామని అన్నారు.
 
సంఘీభావం తెలిపిన వారిపై కేసులు అలానే ఉన్నాయి 

అధికారం అనేది ఎవరూ మనకి పిలిచి ఇవ్వరు. మనమే దానిని చేజిక్కుంచుకునే స్థితిలో ఉండాలని. టీటీడీ బోర్డులో కాపులకు స్థానం ఇవ్వలేదని హరిరామ జోగయ్య తెలిపారని పవన్ కల్యాణ్ అన్నారు. హక్కుల కోసం పోరాటం చేసేటప్పుడు క్రమ పద్ధతిలో విధివిధానాలు ఉండాలని ఆయన అన్నారు. తుని అంటే అందరికి రైలు దుర్ఘటనే గుర్తొస్తుందని ఆ దుర్ఘటన వల్ల కాపుల సహేతుకమైన డిమాండ్ మరుగునపడిపోయిందని, భవిష్యత్తులో అలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని అన్నారు. తుని రైలు దుర్ఘటనలో నమోదైన కేసులను జగన్ రెడ్డి ప్రభుత్వం కొట్టేసిందని ఆయన అన్నారు. అయితే తుని ఘటనకు సంఘీభావంగా వివిధ జిల్లాల్లో నిరసన తెలిపిన వారిపై ఇంకా కేసులు నడుస్తునే ఉన్నాయని, వాటిని కూడా ఎత్తేయాలని అన్నారు.

భారతదేశంలో కులాలను పక్కన పెట్టి రాజకీయం చేయలేమని, కులాలను అర్ధం చేసుకొనే రాజకీయం చేయాలని, ఒక కులాన్ని  భుజం మీద పెట్టుకొని ఊరేగే పరిస్థితి లేకుండా... ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన కులాలను గుర్తించి వారిని అన్ని కులాలతో సమతుల్యం ఏర్పడేలా చేయాలని పవన్ కల్యాణ్ అన్నారు. కాపులు బలోపేతం అవ్వడం అంటే బీసీలను బలహీనులను చేయడం కాదని, వారికి రావాల్సిన హక్కులను తిరిగి తెచ్చుకోవడమని అన్నారు. కాపుల వెనుకబాటుతనం, అసంతృప్తిని మనస్ఫూర్తిగా అర్ధం చేసుకున్నవాడిగా చెబుతున్నాను... బీసీలకు ఇబ్బంది లేకుండా కాపుల న్యాయమైన డిమాండ్లను బలంగా ముందుకు తీసుకెళ్తానని  అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios