పార్టీ దెబ్బకు ఇప్పటికి ఇద్దరు నేతలు కుటుంబాల్లో కల్లోలం రేగింది.

పాము తన పిల్లల్ని తనే తినేస్తుందంటారు. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పరిస్ధితి కూడా అదేవిధంగా తయారైంది. ప్రత్యర్ధి పార్టీలకు చెందిన నేతలను వేధిస్తున్నారంటే పోనీలే రాజకీయాల్లో ఇవన్నీ సహజమే కదా అని సరిపెట్టుకోవచ్చు. కానీ సొంత పార్టీ నేతలనే పార్టీ పొట్టన పెట్టుకుంటుంటే ఇక ఏమి చెయ్యాలి. ఎవరికి చెప్పుకోవాలి.

ఇపుడు రాష్ట్రంలో జరుగుతున్నది అదే. పార్టీ దెబ్బకు ఇప్పటికి ఇద్దరు నేతలు కుటుంబాల్లో కల్లోలం రేగింది. నేతల అధికార దాహం ముందు ఇద్దరు చోటా నేతల వ్యవహారం పీకలకు వచ్చింది. 

గుంటూరు జిల్లాలోని బాపట్ల మండల పరిషత్ అధ్యక్షురాలిగా గెలిచిన విజేతమ్మ తాజాగా ప్రాణాపాయ స్ధితిలో పడ్డారు. ఎంపిపిగా గెలిచిన ఆమెను పదవికి రాజీనామా చేయమని స్ధానికి నేతలు ఒత్తిడి చేస్తున్నారు. అయితే, అమె ససేమిరా అనటంతో పంచాయితీ జిల్లా అధ్యక్షుని వద్దకు చేరుకుంది.

పంచాయితీలొ స్వయంగా జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులే విజేతమ్మను పదవికి రాజీనామా చేయమన్నారు. అయినా ఆమె మాట రాజీనామాకు సిద్ధ పడలేదు. దాంతో ఎంపిపిపై అందరూ కలిసి ఒత్తిడి తెచ్చారు. దాంతో గుండెనొప్పితో హటాత్తుగా కుప్పకూలిపోయారు.

ఆమెను తొలుత స్ధానిక ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు. ఇపుడు ఆమె పరిస్ధితి ఆందోళనగానే ఉందని పార్టీ వర్గాల సమాచారం.

గతంలో ఇదే జిల్లాలోని మాచర్ల మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్రీదేవి విషయంలో కూడా ఇదే విధంగా జరగటం గమనార్హం. ఎన్నికలకు ముందు అమెరికాలో ఉన్న దంపతులను స్ధానిక నేతలు ఒత్తిడి చేసి మరీ రప్పించారు. వచ్చిన తర్వాత శ్రీదేవికి పార్టీ టిక్కెట్టు ఇచ్చి పోటీ చేయించారు.

నామినేషన్ దాఖలు చేసిన తర్వాత అభ్యర్ధిని నేతలంతా కలిసి గాలికి వదిలిపెట్టేసారు. అయితే, విదేశాల నుండి రావటం, అప్పటికే నామినేషన్ కూడా దాఖలు చేయటంతో శ్రీదేవి దంపతులు ఎన్నికలను ప్రతిష్టగా తీసుకుని పోటీలో నిలిచారు. తీరా గెలిచిన తర్వాత కొంత కాలానికి ఛైర్ పర్సన్ గా ఉండేందుకు వీల్లేదంటూ ఆమెపై ఒత్తిళ్ళు మొదలుపెట్టారు.

విదేశాల నుండి వచ్చేయటం, ఎన్నికల కోసం భారీగా అప్పులు చేయటంతో పాటు రాజీనామాకు నేతల ఒత్తిళ్ళు తోడవ్వటంతో శ్రీదేవి భర్త మల్లికార్జునకు గుండె పోటు వచ్చింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా ఉపయోగం లేకపోయింది. మనస్తాపంతో కొద్ది రోజుల తర్వాత ఛైర్ పర్సన్ కూడా ఆత్మహత్య చేసుకున్నారు.

ఇపుడు బాపట్ల ఎంపిపి వ్యవహారం కూడా అదే దిశగా వెళుతోంది. కేవలం తమ సామాజిక వర్గం నేతలు మాత్రమే పదవుల్లో ఉండాలన్న ఉద్దేశ్యంతో, పై వాళ్ళ అండదండలతో జిల్లా స్ధాయి నేతలు ఇంత కర్కశంగా వ్యవహరించటంపై సర్వత్రా మండిపడుతున్నారు.