మహిళా నేతలపై వేధింపులు పెరుగుతున్నా,  మహిళా మంత్రులు, ఎంఎల్ఏ, ఎంపిలు అస్సలు నోరు మెదపకపోవటం విచిత్రం.

అధికార పార్టీలో వేధిపులకు గురౌతున్న మహిళా నేతల జాబితాలో తాజాగా జానీమూన్ కూడా చేరారు. ఇప్పటికే ఇద్దరు నేతల కుటుంబాల్లో కల్లోలం రేపిన తమ్ముళ్ళు ఈ సారి ఏకంగా జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ జానీమూన్ కుటుంబంపైనే గురిపెట్టటం గమనార్హం.

తెలుగుదేశం వ్యవస్ధాపకుడు ఎన్టిఆర్ హయంలో మహిళలకు పార్టీలో ఎంతో గౌరవ మర్యాధలు తక్కేవి. ఎందరో మహిళలు అన్నగారి మీద నమ్మకంతోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అన్నగారు కూడా అదే విధంగా మహిళలను ‘తెలుగు మహిళ’ అంటూ ఎంతో ఆధరంగా చూసేవారు. అటువంటిది ‘చంద్రన్న’ హయాంలో మహిళా నేతలకు ఈ వేధిపులేమిటో.

2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు వ్యతిరేకంగా తమ్ముళ్ళు మరీ రెచ్చిపోతున్నారు. దెందులూరు ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గుంటూరు జిల్లాలో ఇప్పటికే ఇద్దరు మహిళా నేతల కుటుంబాల్లో కల్లోలం రేగింది.

ఇటీవలే గుంటూరు జిల్లా బాపట్ల ఎంపిపి విజేతమ్మ భర్తను తమ్ముళ్ళు పొట్టన బెట్టుకున్నారు. అలాగే, తమ్ముళ్ళ వేధింపుల వల్లే జిల్లాలోని మాచర్ల మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్రీదేవి దంపతులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. కాకపోతే ఈసారి జానీమూన్ పై వేధిపులకు దిగుతున్నది ఏకంగా మంత్రి రావెల కిషోర్ బాబే కావటం గమనార్హం.

రావెల నుండి తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ ఛైర్ పర్సన్ మీడియా ముందే కన్నీళ్ళ పర్యంతమయ్యారు. జానీమూన్ ఆరోపణలు పార్టీలో సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు పట్టించుకోకపోవటం వల్లే మహిళా నేతలపై వేధిపులు పెరిగిపోతున్నట్లు ఆరోపణలు వినబడుతున్నాయి.

తనతో పాటు తన కుటుంబాన్ని వేధిస్తున్నారంటూ దాదాపు మంత్రిస్ధాయిలో ఉన్న ఛైర్ పర్సన్ ఏకంగా మంత్రిపైనే బహిరంగంగా ఆరోపణలు చేయటమంటే మామూలు విషయం కాదు. తెరవెనుక ఏ స్ధాయిలో వేధిపులు జరగకపోతే జానీమూన్ ఇపుడు మీడియా ముందే భొరుమంటారు? మహిళా నేతలపై వేధింపులు పెరుగుతున్నా, మహిళా మంత్రులు, ఎంఎల్ఏ, ఎంపిలు అస్సలు నోరు మెదపకపోవటం విచత్రం.