పార్టీ మారలేదని అంత పని చేస్తారా ?

పార్టీ మారలేదని అంత పని చేస్తారా ?

పార్టీ ఫిరాయింపుల కోసం టిడిపి ప్రత్యర్ధులను బాగానే ఇబ్బందులు పెడుతోంది. ఏదో ఒక విధంగా ప్రలోభాలకు గురిచేయటం మామూలైపోయింది. ఒకవేళ లొంగకపోతే వేధింపులు మొదలుపెట్టి లొంగదీసుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై వేధింపుల ఆరోపణలు వినబడుతున్నాయి. సొంత జిల్లా నెల్లూరులో వైసిపి నేతలను టిడిపిలోకి మారాలంటూ మంత్రి వేధిస్తున్నారట. మంత్రి వింటే సరి. లేకపోతే మాత్రం వెధింపులు తప్పవంటున్నారు. ఇంతకీ జరిగిందేంటంటే, జిల్లాలోని పొదలకూరు సర్పంచ్, వైఎస్సార్సిపీ పంచాయితీ రాజ్ విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తెనాలి నిర్మలమ్మ మంత్రిపై తీవ్రమైన ఆరోపణలు చేసారు. తనను టిడిపిలో చేరాలని కొంతకాలంగా సోమిరెడ్డి పరోక్షంగా సంకేతాలు పంపుతున్నట్లు చెప్పారు.

దళిత సర్పంచ్ ను అందులోనూ మహిళ అని కూడా చూడకుండా ఈ వేధింపులేంటో తనకు అర్ధం కావటం లేదని వాపోయారు. మంత్రి పంపుతున్న పరోక్ష సంకేతాలకు స్పందిచకపోయేసరికి తనకు వేధింపులు మొదలయ్యాయన్నారు. టిడిపికి చెందిన ఎంపిటిసి, వార్డు సభ్యులతో తనపై అవినీతి ఆరోపణలు చేయించి జిల్లా పంచాయితీ అధికారి ద్వారా విచారణ జరిపించినట్లు తెలిపారు.

అయితే, అధికారుల విచారణలో తాను ఎటువంటి అవినీతకి పాల్పడలేదని తేలినా వదిలిపెట్టకుండా వేధింపులు మరింత పెంచారట. జిల్లాస్ధాయి అధికారులపై ఒత్తిడి తెచ్చి తన చెక్ పవర్ రద్దు చేయించినట్లు నిర్మలమ్మ ఆరోపించారు. 13వ ఆర్ధిక సంఘం నిధులు రూ. 12 లక్షలు, ఇతర నిధులు రూ. 51 లక్షలు తాను దుర్వినియోగం చేసినట్లు తనపై మంత్రి ఆరోపణలు చేయించినట్లు మండిపడ్డారు. అయితే, పంచాయితీ తరపున చేసిన ప్రతీ ఖర్చు బ్యాంకుద్వారా మాత్రమే చేసినట్లు సర్పంచ్ వివరించారు. బ్యాంకు ద్వారా చేసిన చెల్లింపుల్లో అక్రమాలు ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. కేవలం తాను పార్టీ మారనందుకే తనపై వేధింపులకు పాల్పడుతున్నట్లు సర్పంచ్ ధ్వజమెత్తారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos