ఈ పరిస్ధితుల్లోనే ఆనం సోదరులు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారంటూ ప్రచారం మొదలైంది. ఒకసారి చంద్రబాబుతో విషయమేదో గట్టిగా మాట్లాడేసుకుంటే తమ దారేదో తాము చూసుకోవచ్చని ఆనం సోదరులు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

‘ఓడలు బండ్లు, బండ్లు ఓడలవుతాయ’నేందకు ఆనం సోదరులే తాజా ఉదాహరణ. నెల్లూరు జిల్లాలో ఏకంగా పదేళ్ళ పాటు ఆనం సోదరులు చక్రం తిప్పారు. అటువంటిది ఇపుడు త్రిశంకుస్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. రాజకీయంగా భవిష్యత్తేమిటో తెలీక అవస్తలు పడుతున్నారు. ఉన్న టిడిపిలో మర్యాదలు దక్కటం లేదు. ప్రతిపక్ష వైసీపీలోకి వెళ్ళాలంటే అన్నీ అడ్డంకులే. దాంతో ఏం చేయలో పాలుపోవటం లేదట సోదరులకు.

నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబం రాజకీయంగా పెద్దకుటుంబమే. కానీ ఆ రోజులు పోయాయి. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ లోనే కొంతకాలం ఉన్నా వేరే దారిలేక టిడిపిలో చేరారు. ముందుగా వైసీపీలోకే వెళదామనుకున్నా పరిస్ధితులు అనుకూలింలేదు. ఎందుకుంటే, వైసీపీలోని మేకపాటి సోదరులు, కోటంరెడ్డి, కాకాణి గోవర్ధన రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ ఇలా..ఎవరూ ఆనం సోదరులు వైసీపీలోకి రావటాన్ని ఇష్టపడలేదు. దాంతో జగన్ కూడా వీరి విషయంలో సానుకూలంగా స్పందించలేదు. దాంతో వేరే దారిలేక టిడిపి తీర్ధం పుచ్చుకున్నారు.

టిడిపిలో అయితే చేరారు కానీ అడుగడుగునా అవమానాలే. ప్రధానంగా సోమిరెడ్డికి ఆనం సోదరులతో పడదు. అలాగే, నారాయణ కూడా అంతంత మాత్రమే. ఇక మిగిలిన నేతలెవరితోనూ ఆనం సోదరులకు సరైన సంబంధాలు లేవు.

దానికితోడు పార్టీలో చేరేటపుడు ఇచ్చిన మర్యాద తర్వాత చంద్రబాబు కూడా ఇవ్వలేదు. పార్టీలో చేరేటపుడు ఎంఎల్సీ ఇస్తానని ఇచ్చిన హామీని తర్వాత చంద్రబాబు నిలుపుకోలేదు. దాంతో చంద్రబాబుపై ఒకవైపు అలక, ఇంకోవైపు ఆగ్రహం మరోవైపు పొమ్మనకుండా పొగబెడుతున్నారన్న అనుమానం. దాంతో ఇపుడు ఏం చేయాలో, ఎటుపోవాలో సోదరులకు అర్ధం కావటం లేదు.

ఈ పరిస్ధితుల్లోనే ఆనం సోదరులు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారంటూ ప్రచారం మొదలైంది. ఈరోజు చంద్రబాబునాయుడును కలిసారు సోదరులు. ఎంఎల్సీ ఇచ్చే విషయంపైనే తాడో పేడో తేల్చుకుందామనే చంద్రబాబును కలిసి ఉంటారని అందరూ భావిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో ఎటూ ఒంటరిగా పోటీ చేయాలని భాజపా కూడా ప్రయత్నిస్తోంది. దానికి తగ్గట్లే ఏ పార్టీకి చెందిన నేతలనైనా సరే వస్తే వెంటనే చేర్చుకునేట్లుంది. అందుకే ఒకసారి చంద్రబాబుతో విషయమేదో గట్టిగా మాట్లాడేసుకుంటే తమ దారేదో తాము చూసుకోవచ్చని ఆనం సోదరులు నిర్ణయించుకున్నట్లు సమాచారం.