వైసీపీతో బీజేపీకి ఎలాంటి సంబంధాలు లేవన్నారు ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. బీజేపీ-జనసేన కూటమిలో చిచ్చు పెట్టేందుకే టీడీపీ నేతలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

బీజేపీపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు గట్టి కౌంటరిచ్చారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీకి , బీజేపీకి మధ్య ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామేమోనని టీడీపీకి భయం పట్టుకుందని.. అందుకే ఆ పార్టీ నేతలు ఫ్రస్ట్రేషన్‌తో మాట్లాడుతున్నారని జీవీఎల్ చురకలంటించారు. ఓ వైపు బీజేపీతో పొత్తు కోసం తహతహలాడుతూ.. ఎన్నో గడపలు తొక్కుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీకి చెందిన కీలక నాయకులను తెలుగుదేశం తన పార్టీలోకి చేర్చుకుందని.. దీనిపై తామే టీడీపీని తిట్టాలని జీవీఎల్ అన్నారు. రాష్ట్రంలో వైసీపీకి బీజేపీ, జనసేనలే ప్రత్యామ్నాయమని ఆయన స్పష్టం చేశారు. తామే గడిచిన నాలుగేళ్లుగా ప్రతిపక్ష పాత్ర పోషించామని జీవీఎల్ తెలిపారు. జనసేన- బీజేపీ కూటమిలో చిచ్చు పెట్టేందుకు తెలుగుదేశం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. బీజేపీపై బురద జల్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని జీవీఎల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంపై జీవీఎల్ స్పందిస్తూ.. బీఆర్ఎస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అంటే భ్రమ రాజకీయాల సమితి అంటూ చురకలంటించారు. ఈవోఐలో బీఆర్ఎస్ ఎందుకు పాల్గొనలేదని నరసింహారావు ప్రశ్నించారు. స్టీల్ కొంటాం, స్టీల్ అమ్ముతామంటూ బీఆర్ఎస్ నాటకాలు ఆడుతోందని ఆయన దుయ్యబట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో బీఆర్ఎస్ అనవసరంగా జోక్యం చేసుకుంటోందని జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే గంగా పుష్కరాల కోసం వెళ్లే తెలుగు యాత్రికుల కోసం సాయంగా వుంటామని జీవీఎల్ తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే బుక్ లెట్ విడుదల చేశామని ఆయన వెల్లడించారు.

Also Read: పవన్‌ను బీజేపీ భయపెడుతోంది.. ఎంతకాలం అడ్డుకుంటుందో చూస్తాం: టీడీపీ నేత పితాని

అంతకుముందు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను బీజేపీ భయపెడుతోందని ఆరోపించారు. గురువారం పితాని సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ టీడీపీతో కలవడానికి ముందుకు వస్తుంటే బీజేపీ భయపెడుతోందని విమర్శించారు. పవన్‌కు బీజేపీ తాళం వేయాలని చూస్తుందని అన్నారు. జనసేన టీడీపీతోనే ఉందని చెప్పుకొచ్చారు. పవన్‌ను బీజేపీ ఎంతకాలం అడ్డుకుంటుందో చూస్తామని అన్నారు. 

బీజేపీ ముందు ఒక రాజకీయం, తెరవెనక మరో రాజకీయం చేస్తోందని విమర్శించారు. వైసీపీకి బీజేపీ తాబేదారుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ప్రతిపక్షమో? అధికారపక్షమో తెల్చుకోవాలని అన్నారు. బీజేపీ నేతలు మూడు రాజధానులపై ఒకసారి అనుకూలమంటారు.. మరోసారి వ్యతిరేకమంటారని విమర్శించారు.