తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను బీజేపీ భయపెడుతోందని ఆరోపించారు.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను బీజేపీ భయపెడుతోందని ఆరోపించారు. గురువారం పితాని సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ టీడీపీతో కలవడానికి ముందుకు వస్తుంటే బీజేపీ భయపెడుతోందని విమర్శించారు. పవన్‌కు బీజేపీ తాళం వేయాలని చూస్తుందని అన్నారు. జనసేన టీడీపీతోనే ఉందని చెప్పుకొచ్చారు. పవన్‌ను బీజేపీ ఎంతకాలం అడ్డుకుంటుందో చూస్తామని అన్నారు. 

బీజేపీ ముందు ఒక రాజకీయం, తెరవెనక మరో రాజకీయం చేస్తోందని విమర్శించారు. వైసీపీకి బీజేపీ తాబేదారుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ప్రతిపక్షమో? అధికారపక్షమో తెల్చుకోవాలని అన్నారు. బీజేపీ నేతలు మూడు రాజధానులపై ఒకసారి అనుకూలమంటారు.. మరోసారి వ్యతిరేకమంటారని విమర్శించారు. 

మరోవైపు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి, వైసీపీకి సంబంధం లేదని ప్రజలు అనుకోవాలని అన్నారు. అచ్చెన్నాయుడో, సునీల్ దియోధరో, ఇంకా వేరెవరో అనుకుంటే ఫలితం లేదని చెప్పారు. బీజేపీకి, వైసీపీకి సంబంధం ఉందో? లేదో? ప్రజలకు తెలుసునని అన్నారు. బీజేపీపై మాజీ మంత్రి పితాని సత్యనారాయణ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని అన్నారు. టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని అందరికి అర్థమైందని తెలిపారు. చంద్రబాబును ఎవరూ విమర్శించినా ప్రజలు ఛీ కొడుతారని అన్నారు.