అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సిఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన మంగళవారం సాయంత్రం జగన్ తో భేటీ అయ్యారు.

జగన్ తో భేటీ తర్వాత జీవీఎల్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగానే కలిశానని, తమ మధ్య రాజకీయ చర్చలేమీ జరగలేదని ఆయన చెప్పారు. లోక్‌సభ ఉప సభాపతి పదవిని ఎవరికిస్తారో తనకు తెలియదని, ఆ విషయాన్ని తమ బిజెపి అధిష్ఠానం నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. 

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి లోకసభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారనే విషయం తనకు తెలియదని జీవీఎల్‌ అన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతతీసుకున్న నిర్ణయాలకు జగన్మోహన్ రెడ్డికి తాను అభినందనలు తెలిపానని చెప్పారు. గత ప్రభుత్వంలో జరిగిన పలు అంశాలపై సీఎంతో చర్చించినట్లు జీవీఎల్‌ చెప్పారు.

ఇదిలావుంటే, సేవాభావంతో తమ పార్టీలోకి వచ్చేవారందరినీ ఆహ్వానిస్తామని జీవీఎల్ నరసింహారావు అన్నారు. అయితే, పార్టీలో అంతర్గత చర్చ తర్వాతే టీడీపీ రాష్ట్ర స్థాయి నేతలను బీజేపీలో చేర్చుకుంటామని చెప్పారు.  ఏపీ గవర్నర్‌గా సుష్మా స్వరాజ్‌ను నియమిస్తారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.

 ఏపీ గవర్నర్‌ను మార్చే ఆలోచనే లేదని ఆయన స్పష్టం చేశారు. ఏపీకి గవర్నర్‌గా సుష్మాస్వరాజ్ వస్తున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు.