విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పై బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు తీవ్రమైన ఆరోపణలు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంపైనా విరుచుకుపడ్డారు. ఐటీ కంపెనీల పేరుతో చంద్రబాబు భూకుంభకోణాలకు పాల్పడుతున్నారని జీవీఎల్ ఆరోపించారు. ఇప్పటి వరకూ భూ కేటాయింపులు జరిపినట్లు చూపించిన కంపెనీలు ఎవీ రాష్ట్రానికి వచ్చిన దాఖలాలు లేవని అన్నారు.

ప్రభుత్వం కేటాయించిన కంపెనీలన్నీ లోకేష్‌ బినామీలేనని విమర్శించారు. 24 గంటల్లో కంపెనీలకు కేటాయించిన భూముల వివరాలను, ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారో వారి వివరాలను చెప్పాలని డిమాండ్ చేశారు. ఐటీ కంపెనీల పేరుతో కోట్ల రూపాయలు లూటీ చేశారని జీవీఎల్ అన్నారు. విజయవాడలోని పటమట స్థాయి కంపెనీలను అంతర్జాతీయ స్థాయి కంపెనీలుగా చెప్పుకుంటున్నారని ఆయన అన్నారు.
 
నారా లోకేష్‌ అర్హతలపై పవన్‌ కళ్యాణ్‌ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికలు వస్తున్నందు వల్లనే చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్ బాధితుల దగ్గరకు వెళ్తున్నారని అన్నారు. 

సహాయక చర్యలు తక్కువ.. ప్రచారం ఎక్కువ అని ఆయన చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. ఉక్క కర్మాగారంపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వాల్సి ఉందని చెప్పారు.

ఎమ్మెల్యేలను చంద్రబాబు డబ్బులతో కొన్నారా ఆయన ప్రశ్నించారు. దమ్ముంటే చంద్రబాబు ఆస్తులపై తీర్మానం చేయాలని అన్నారు. సిఎం రమేష్ తీరు అసహ్యంగా ఉందని, తానే ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పారు. 

సిఎం రమేష్ చంద్రబాబు బినామీ అని జీవీఎల్ అన్నారు. సిఎం రమేష్ దిగజారుడు వ్యక్తి అని ఆయన వ్యాఖ్యానించారు. సిఎం రమేష్ ను రాజ్యసభకు పంపినందుకు చంద్రబాబు ఎపి ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రమేష్ ను రాజ్యసభ సభ్యత్వం నుంచి తొలగించాలని అన్నారు. 

జాతీయ మీడియాలో వచ్చిన కథనాలకు సిఎం రమేష్ ఏం సమాధానం చెబుతారని అడిగారు. వంద కోట్ల మేర లెక్క చెప్పని ఆస్తులు తేలాయని ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికలో వార్తాకథనం వచ్చింది. దానిపై జీవీఎల్ ఆ ప్రశ్న వేశారు. మీసం మెలేసిన రమేష్ జాతీయ మీడియాలో వచ్చిన వార్తాకథనంతో మీసం తీసేసుకుంటారా అని అడిగారు. 

పార్లమెంటు సభ్యులకు ఉండాల్సిన లక్షణాలేవీ రమేష్ కు లేవని అన్నారు. రమేష్ వాడే భాష పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధంగా ఉందని అన్నారు.