విజయవాడ: తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల పొత్తుపై బీజేపీఎంపీ జీవీఎల్ నరసింహారావు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, టీడీపీల కలయిక అనైతికమంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఇరుపార్టీల పొత్తులపై ట్విట్టర్లో తిట్టిపోశారు.

ఊరందరిదీ ఒక దోవ, ఉలిపి కట్టెకు ఒకదోవ అనేలా ఉంది చంద్రబాబుగారి తీరు ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  దేశ ప్రజలు కాంగ్రెస్ ముక్త్ (లేని) భారత్ కావాలని  కోరుకుంటున్నారని తెలిపారు. 

అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ఆంధ్రకు అన్యాయం చేసిన కాంగ్రెస్ చెంతన చేరారని మండిపడ్డారు. తెలుగుదేశం చేస్తున్నది నయవంచన అంటూ విమర్శించారు. దారినిపోయే శనీశ్వరాన్ని పిలిచి పీట వేస్తున్న టీడీపీకి దారుణ ఓటమి తప్పదని జీవీఎల్ హెచ్చరించారు.