ఇది రాహూల్ వైఫల్యమే

ఇది రాహూల్ వైఫల్యమే

దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేకెత్తించిన గుజరాత్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఓ గుణపాఠమే చెప్పింది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం పోయిన ఎన్నికలతో పోల్చితే సీట్లు, ఓట్ల సంఖ్య పెరిగినా అధికారానికి ఆమడదూరంలోనే నిలిచిపోయిందన్నది వాస్తవం. ప్రస్తుత పరిస్దితికి ఒకరకంగా కొత్తగా ఎన్నికైన ఏఐసిసి రాహూల్ గాంధీనే కారణమని చెప్పకతప్పదు. ఎందుకంటే, ఫలితాల సరళని బట్టి చూస్తే కాంగ్రెస్ అభ్యర్ధులపై గెలిచిన భారతీయ జనతా పార్టీ అభ్యర్ధుల మెజారిటీ చాలా తక్కువ.

గుజరాత్ లో అధికారానికి రావాలని కలలుగన్న కాంగ్రెస్ వ్యూహాలు పన్నటంలో మాత్రం విఫలమైంది. పార్టీ జాతీయ అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకోవాలనుకున్న వ్యక్తికి నిజంగా గుజరాత్ ఎన్నికల రూపంలో మంచి అవకాశం వచ్చింది. అయితే, రాహూల్ చేతులారా అవకాశాన్ని చేజార్చుకున్నారు. తాను ఎదుర్కోబోయే శతృవు ఎంతటి బలవంతుడో అన్న అంచనాలు కూడా రాహూల్లో ఉన్నట్లు కనబడలేదు.

ఎందుకంటే, ప్రధానమంత్రి నరేంద్రమోడి స్వొంత రాష్ట్రం గుజరాతన్న విషయం అందరికీ తెలిసిందే. మోడి ప్రధానమంత్రే అయినప్పటికీ గుజరాత్ ముఖ్యమంత్రి బాధ్యతలు కూడా మోడినే స్వయంగా పర్యవేక్షించారు. గుజరాత్ లో పార్టీ ఓటమి భాజపా ఓటమిగా కాకుండా మోడి తన వ్యక్తిగత ఓటమిగా భావించారు. అందుకనే ఎన్నికల వ్యూహరచన, అమలుపై పూర్తిస్ధాయిలో దృష్టి పెట్టారు.

అదే సమయంలో అధికారంలోకి వచ్చేస్తామన్న అతి విశ్వాసంతో ఉన్న రాహూల్ మిగిలిన ప్రతిపక్షాలను కలుపుకుని పోవాలన్న చొరవ ఎక్కడా చూపలేదు. ఇక్కడే కాంగ్రెస్ దెబ్బతింది. కాంగ్రెస్ తో పాటు ప్రతీ నియోజకవర్గంలోనూ ఎన్సీపీ, బిఎస్పీతో పాటు అనేక స్ధానిక పార్టీలు, స్వతంత్రులు పోటీలో నిలిచారు.

 ఫలితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయాయి. దాంతో చాలా నియోజకవర్గాల్లో భాజపా అభ్యర్ధులు అతి తక్కువ మెజారితో గిలిచారు. దాదాపు అన్నీ నియోజకవర్గాల్లో గెలుపుకోసం కాంగ్రెస్ ఇటు భాజపాతో పోటీ పడుతూనే అటు మిగిలిన పార్టీలతో కూడా పోటీ పడాల్సి వచ్చింది. ఇన్ని పార్టీలు రంగంలో ఉన్న తర్వాత కచ్చితంగా అది అధికార పార్టీకే కలిసి వస్తుందని చెప్పటంలో సందేహమే అవసరం లేదు. ఇక్కడే రాహూల్ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page