అమరావతి: అన్‌లాక్‌ 4.0లో భాగంగా ఈ నెల 21 నుంచి  9 నుండి 12 తరగతుల వరకు క్లాసుల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పలు మార్గదర్శకాలను విడుదల చేసిందని... వాటి ప్రకారమే నడుచుకోవాలని కోవిడ్-19 స్టేట్ నోడల్ ఆఫీసర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు. ఈ మార్గదర్శకాల్లో ప్రధానంగా 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఇష్టమైతేనే బడికి వెళ్లే వెసులుబాటు కల్పించిందని... లేదంటే ఇంట్లోనే ఉంటూ ఆన్‌లైన్‌ క్లాసులు వినే ఆప్షన్‌ ఇచ్చిందన్నారు. ఈ మేరకు తల్లిదండ్రులు/సంరక్షకుల నుంచి రాతపూర్వక లేఖను విద్యార్థులు సమర్పించాలని సూచించారు.

కోవిడ్-19 నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ నుంచి కేంద్ర ప్రభుత్వం దశలవారీగా అన్ లాక్ పేరుతో అనుమతులు ఇస్తూ వస్తోంది.ఈ క్రమంలో అన్ లాక్ 4.0 లో భాగంగా సెప్టెంబర్ 21వ తేదీ నుంచి 9 నుంచి 12 వ తరగతి వరకు పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కేంద్రం సూచించిన మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పాటిస్తూ కోవిడ్ 19 వ్యాప్తి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 

''కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించడానికి సాధారణ ప్రజలు తీసుకునే ప్రజారోగ్య చర్యలన్నింటినీ ఇక్కడ కూడా అందరూ (అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు మరియు సందర్శకులు) పాటించాలి. సాధ్యమైనంత వరకు బహిరంగ ప్రదేశాల్లో కనీసం 6 అడుగుల దూరం పాటించాలి. ఫేస్ కవర్లు / మాస్కులు తప్పనిసరిగా ఉపయోగించాలి.  సబ్బుతో (కనీసం 40-60 సెకన్ల పాటు) తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. మీ చేతులు మురికిగా కనిపించకపోయినా శుభ్రం చేసుకోండి. ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్ (కనీసం 20సెకన్లు) శుభ్రం చేసుకోవాలి'' అని డాక్టర్ శ్రీకాంత్ కేంద్ర మార్గదర్శకాల గురించి వివరించారు. 

read more   జగన్ సంచలన నిర్ణయం: రూ.4,600 కోట్ల రోడ్డు టెండర్లు రద్దు.. కారణమిదే

''దగ్గు, తుమ్ములు వచ్చినపుడు తప్పనిసరిగా మోచేతలను అడ్డుపెట్టుకోవడం లేదా కర్చీఫ్, టిష్యూ పేపర్ ఉపయోగించాలి. టిష్యూ పేపర్ ను పారవేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడూ గమనిస్తూ ఉండాలి. ఒకవేళ ఏదైనా అనారోగ్యకర లక్షణాలు కనిపిస్తే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి. పాఠశాలల పరిసరాల్లో, డస్ట్ బిన్లలో, వాష్ రూమ్ లలో ఉమ్మివేయడం నిషేధించబడింది'' అని తెలిపారు.''ప్రతి ఒక్కరూ ఆరోగ్యసేతు యాప్‌ ఇనిస్టాల్ చేయడంతోపాటు ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలి. అలాగే ఆన్‌లైన్ / దూరవిద్యలకు అనుమతించడం జరిగింది. దాన్నే కొనసాగించాలని ప్రోత్సహించండి. 9 నుంచి 12వ క్లాసు విద్యార్థులు వారంతట వారే టీచర్ల నుంచి సలహాలు, సందేహాలు తీర్చుకోవడానికి రావచ్చు. ఇది ఆయా విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతి ఉండాలి. అలా వచ్చిన విద్యార్థులతో టీచర్లు తగిన దూరం పాటిస్తూ వారితో మాట్లాడాలి'' అని సూచించారు. 

''కంటైన్మెంట్ జోన్లలో ఉండే పాఠశాలలకు విద్యార్థులు, స్టాఫ్ కూడా వెళ్లకూడదు. విద్యా సంస్థలు తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి ముందుగానే హాస్టల్లు, లేబొరేటరీలు మరియు అందరూ కలిసి ఉపయోగించే సాధారణ స్థలాలు, అక్కడ తరచూ తాకే వస్తువులు, ప్రాంతాలను 1% సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో శుభ్రపరచాలి. పాఠశాలలను క్వారంటైన్ కేంద్రాలుగా ఉపయోగించి ఉన్నట్టయితే వాటిని తగినవిధంగా శుభ్రం చేయాలి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఇదివరకు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలి'' అని ఆదేశించారు. 

''పాఠశాలలకు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ (50శాతం వరకు) మాత్రమే వచ్చేలా చూసుకోవాలి. అది కూడా విద్యార్థులకు అవసరమైన ఆన్ లైన్ టీచింగ్, టెలీ కౌన్సిలింగ్ కు సంబంధించిన పనుల కోసం రప్పించాలి. 9 నుంచి 12 తరగతి వరకు విద్యార్థులు ఆన్ లైన్, వర్చువల్ క్లాసులకు సంబంధించిన సందేహాల కోసం  పాఠశాలలకు రావచ్చు. ఇది కేవలం విద్యార్థులకు సంబంధించిన వ్యక్తిగత శ్రద్ధమీద ఆధారపడి ఉంటుంది.  అందుకు వారి తల్లిదండ్రులు కూడా రాతపూర్వకంగా తెలియజేయాలి. బయో మెట్రిక్‌ హాజరు పద్దతి అవసరం లేదు. వీలైనంత వరకు కాంటాక్ట్ లెస్ ప్రత్యామ్నాయ పద్దతుల ద్వారా సిబ్బంది హాజరును గుర్తించే ఏర్పాట్లు చేసుకోవాలి'' అని విద్యాశాఖకు సూచించారు.