విజయవాడ: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత దేవినేని ఉమా మహేశ్వర రావు చిక్కుల్లో పడనున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ ఎస్సై విజయ్ కుమార్ ఆత్మహత్యపై చేసిన వ్యాఖ్యల విషయంలో ఆయనకు చిక్కులు ఎదురు కానున్నాయి. తాను చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు చూపించాలని దేవినేని ఉమా మహేశ్వర రావుకు నోటీసులు జారీ చేస్తామని డీఎస్పీ సత్యానందం చెప్పారు. 

దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. విజయ్ కుమార్ అనునాస్పద స్థితిలో మరణించాడని ఆయన చెప్పారు. విజయ్ కుమార్ మృతిపై దర్యాప్తు సాగిస్తున్నట్లు తెలిపారు. పేకాట దాడుల నిర్వహణలో ఒత్తిళ్లకు తట్టుకోలేక విజయ్ కుమార్ మరణించాడని దేవినేని ఉమ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని ఆయన చెప్పారు. 

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన పిల్లి విజయ్ కుమార్ గుడివాడ టూటౌన్ ఎస్సైగా కొద్ది కాలం క్రితం బాధ్యతలు చేపట్టారు. స్టేషన్ కు సమీపంలోని ఓ ఇంట్లో ఉంటున్నారు. ఆయనకు నిరుడు నవంబర్ లో వివాహమైంది. సోమవారం అర్థరాత్రి ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఈ కేసులో విజయ్ కుమార్ ప్రేయసి సురేఖపై సెక్షన్ 306 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తమ సోదరుడు ఆత్మహత్యకు సురేఖనే కారణమని విజయ్ కుమార్ తమ్ముడు విక్రమ్ ఫిర్యాదు చేశాడు. విచారణ తర్వాత పోలీసులు సురేఖను అరెస్టు చేశారు.