దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పాలనలో చంద్రబాబు ఎన్ని సార్లు ఆందోళనలు చేసారో లెక్కేలేదు.

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు రోజు రోజుకు అసహనం పెరిగిపోతోంది. తాజాగా మీడియాతో మాట్లాడుతూ పరోక్షంగా వైఎస్ జగన్ ను చంద్రబాబు రాక్షసునితో పోల్చారు.

‘చరిత్రలోనూ రాక్షసులున్నారని, యాగాలు చేస్తుంటే అడ్డుకున్నార’ని పేరు ఎత్తకుండానే జగన్ పై విరుచుకుపడ్డారు. పోలవరం పూర్తయితే జగన్ పని అయిపోతుందని అన్నారు. ఆ విషయం తెలిసే పోలవరం ప్రాజెక్టును అడ్దుకుంటున్నట్లు సిఎం ఆరోపించటం విచిత్రంగా ఉంది.

ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోకపోతే తనకు మనుగడ కష్టమని గ్రహించినందునే జగన్ అభివృద్ధిని అడ్డుకుంటున్నట్లు చంద్రబాబు చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. పరిశ్రమలను, ప్రాజెక్టులను అన్నింటినీ జగన్ అడ్డుకుంటున్నట్లు చంద్రబాబు చెప్పటం విడ్డూరంగా ఉంది.

ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో అవినీతి జరుగుతోందని అనుకున్నపుడు ఎండగట్టటమే ప్రతిపక్షం పని. కార్యక్రమాలు, పథకాల అమలులోని లొసుగులను ప్రజలకు వివరించటం విపక్షాల బాధ్యత.

తాము చేపడుతున్న కార్యక్రమాలను, సంక్షేమ పథకాల గురించి ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు చెప్పుకుంటుందో, అందులోని లొసుగులను, లోపాలను, అవినీతిని ప్రజలకు ప్రతిపక్షాలు వివరించటం అత్యంత సహజం. ప్రతిపక్షం అంటే ప్రజాపక్షమని చంద్రబాబుకు తెలీదా?

అయితే, చంద్రబాబు వైఖరి ఎలాగుందంటే, ప్రభుత్వం ఏమి చేసినా ప్రతిపక్షం మాట్లాడకూడదన్నట్లుగా ఉంది. గడచిన రెండున్నరేళ్ల చంద్రబాబు ప్రభుత్వంలో రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో, పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల నిర్మాణం, భూ సేకరణ, పెరిగిపోతున్న ప్రాజెక్టుల అంచనా వ్యయాలు తదితర అంశాల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుంటోందని జగన్ ఆరోపిస్తున్నారు.

ఓటుకునోటు కేసులో ఇరుక్కున్నందున రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు పణంగా పెడుతున్నట్లు జగన్ ఆరోపిస్తున్నారు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తున్న చంద్రబాబు మాట్లాడటం లేదని ధ్వజమెత్తుతున్నారు. జగన్ లేవనెత్తుతున్న అనేక ఆరోపణలు ప్రజలు విస్తృతంగా చర్చించుకుంటున్నవే. అందులో కొత్తదనం ఏమీ లేవు. అయినా చంద్రబాబు సహించలేకున్నారు.

గతంలో పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్నపుడు చంద్రబాబునాయడు ప్రభుత్వంపై ఆరోపణలు చేయలేదా? ప్రజల్లో చైతన్యం తేవాలంటూ బస్సు యాత్రలు, పాదయాత్రలు చేపట్టలేదా? దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పాలనలో చంద్రబాబు ఎన్ని సార్లు ఆందోళనలు చేసారో లెక్కేలేదు.

మరి అప్పుడు వైఎస్ పాలనకు చంద్రబాబు ఎందుకు సహకరించ లేదు? వైఎస్ పాలనలో చంద్రబాబు ‘రాజా ఆఫ్ కరెప్షన్’ అనే పుస్తకాన్ని ముద్రించి దేశవ్యప్తంగా పంచిపెట్టలేదా? చంద్రబాబు ధోరణి ఎలాగుందంటే, ‘తాను చేస్తే సంసారం, ఎదుటి వారు చేస్తే వ్యభిచారం’ అన్నట్లుగా ఉంది.