ప్రభుత్వం నిర్దేశించినట్లుగా టిక్కెట్ మొత్తం ధరలో 75 శాతమే వసూలు చేయాలి. కానీ శాతకర్ణి సినిమా నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కింది.
ఎంతైనా వడ్డించేవాడు మనవాడు...పైగా బావగారు కదా? ఇంకేముంది, వినోదపు పన్ను మినహాయింపుకు చిత్రయూనిట్ రెండో దరఖాస్తు చేసుకుంది. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు మొదట ఇచ్చిన 75శాతం వినోదపు పన్ను మినహాయింపు సరిపోవటం లేదంటూ చిత్రయూనిట్ తాజాగా మరో దరఖాస్తు చేసుకుంది. సినిమాను సైతం చూడకుండానే ప్రభుత్వం మొదట 75 శాతం వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చేసింది. తాజా దరఖాస్తుపై బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయమవుతుంది.
మామూలుగా జరిగేదేమిటంటే ఏదైనా సినిమాకు వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వాలంటే ప్రభుత్వం ముందు స్ర్కీనింగ్ చేయాలి. దేశ, రాష్ట్ర ప్రతిష్టలను పెంచే సినిమాలకు మాత్రమే వినోదపు పన్ను మినహాయింపు ఇస్తారు. పైగా వినోదపు పన్ను మినహాయింపు పొందిన సినిమాలు ప్రభుత్వం నిర్దేశించినట్లుగా టిక్కెట్ మొత్తం ధరలో 75 శాతమే వసూలు చేయాలి. కానీ శాతకర్ణి సినిమా నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కింది. టిక్కెట్ ధరను ఏమాత్రం తగ్గించలేదు. గతంలో ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్న 75 శాతం వెసులుబాటును 100 శాతానికి పెంచాలంటూ తాజాగా దరఖాస్తు చేసుకోవటం గమనార్హం.
ఓవైపు నిబంధనలు ఉల్లంఘిస్తూనే మరోవైపు 100 శాతం వెసులుబాటుకు దరఖాస్తు చేసుకుందంటే అర్ధం ఏమిటి? సినిమా కథానాయకుడు నందమూరి బాలకృష్ణ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులు స్వయంగా బావా, బావమరుదులవ్వటమే. పైగా సినిమా కథాంశం వివాదాస్పదమైంది. టిక్కెట్ల అమ్మకాల విషయంలో ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదుర్కొటోంది. అయినాకానీ చిత్రయూనిట్ వినోదపు పన్ను 100 శాతం వెసులుబాటుకు దరఖాస్తు చేసుకుంది. అదే సమయంలో సామాజిక అంశమైన రైతు సమస్యలపై తీసిని సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రయూనిట్ కూడా వినోదపు పన్ను మినహాయింపుకు చేసిన దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించటం గమనార్హం.
