Asianet News TeluguAsianet News Telugu

ప్రభుత్వమే దౌర్జన్యం చేస్తే ఎట్లా?

ల్యాండ్ పూలింగ్ పై రైతులకు, ప్రభుత్వానికి మధ్య కోర్టులో వివాదం నడుస్తోంది. చేతనైతే రైతులను ఒప్పించి భూములు తీసుకోవాలి. లేకపోతే వారి భూములను వదిలేసి మిగితా భూముల్లో రాజధాని నిర్మించుకోవాలి. వివాదాల్లో ఉన్న 660ఎకరాల కోసం భూసేకరణ నోటిఫికేషన్ ఇవ్వటమే ప్రభుత్వం చేసిన తప్పు.

Govt destroyed crops in lingayapalem village of amaravati area

కంచే చేను మేసినట్లు ప్రభుత్వమే ధౌర్జన్యం చేస్తే ఎట్లా? రాజధాని నిర్మాణానికి భూములివ్వని రైతులపై ప్రభుత్వమే ధౌర్జన్యం చేయటం విచిత్రంగా ఉంది. రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ లో కలవటానికి పలు గ్రామాల రైతులు ససేమిరా అంటున్నారు. అందులో భాగంగా లింగాయపాలెంలోని కొందరు రైతులు కూడా భూములు ఇవ్వలేదు. పైగా సాగు చేసుకునేందుకు న్యాయస్ధానం నుండి అనుమతులు కూడా సాధించుకున్నారు. దాని ప్రకారమే పంటలు కూడా వేసుకున్నారు.  

 

అయితే, భూములు ఇవ్వని రైతులపై సిఆర్డిఏ అనేక రకాలుగా ఒత్తిళ్ళు పెడుతోంది.  ఆమధ్య కొందరు రైతులకు చెందిన పంటలను తగులబెట్టింది కూడా. అయినా రైతులు లొంగలేదు. దాంతో అప్పటి నుండి ప్రయత్నాలు చేస్తూనే ఉంది సిఆర్డిఏ. తాజాగా లింగాయపాలెంలోని అనుమోలు గాంధికి చెందిన పంటలు ధ్వంసమయ్యాయి. 4.03 ఎకరాల్లో వేసిన మొక్కజొన్న, కంద తదితర పంటలు దెబ్బతిన్నాయి. జెసిబిలను పెట్టి మరీ పంటలను ధ్వంసం చేయటం గమనార్హం. పొలం చుట్టూ ఉన్న తాటిచెట్లలో కొన్నింటిని జెసిబిల ద్వారా పడగొట్టేసింది ప్రభుత్వం.

 

తాటిచెట్లను పడగొట్టి మరీ పొలాల్లోకి ప్రవేశించి పంటలను ధ్వంసం చేసింది. విషయం తెలుసుకున్న రైతులు వెంటనే పొలాల వద్దకు చేరుకున్నారు. రైతులు వస్తున్న విషయాన్ని గమనించిన డ్రైవర్ జెసిబిని వదిలేసి పారిపోయారు. అక్రమంగా పంటలను ధ్వంసం చేయటం కాకపోతే డ్రైవర్ జెసిబిని వదిలేసి పారిపోవాల్సిన అవసరం ఏమిటి? పైగా అక్కడ ఒక్క ఉన్నతాధికారి కూడా లేరు. అంటే పొలాల్లోకి రావటానికి అధికారులు భయపడి కేవలం డ్రైవర్లను మాత్రమే పంపారన్నది స్పష్టం.

 

ల్యాండ్ పూలింగ్ పై రైతులకు, ప్రభుత్వానికి మధ్య కోర్టులో వివాదం నడుస్తోంది. చేతనైతే రైతులను ఒప్పించి భూములు తీసుకోవాలి. లేకపోతే వారి భూములను వదిలేసి మిగితా భూముల్లో రాజధాని నిర్మించుకోవాలి. పెనుమాక గ్రామంలోని 660ఎకరాల కోసం భూసేకరణ నోటిఫికేషన్ ఇవ్వటమే ప్రభుత్వం చేసిన తప్పు. అటువంటిది బలవంతంగా భూములు తీసుకునే ఉద్దేశ్యంతో ప్రభుత్వమే పంటల విధ్వంసానికి దిగటం ఏమిటో అర్ధం కావటం లేదు.

Follow Us:
Download App:
  • android
  • ios