రాజధాని రైతులపై ప్రభుత్వం విపరీతమైన ఒత్తిడి తెస్తోంది. రైతులకు కేటియించిన ప్లాట్లను వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటూ తీవ్ర ఒత్తడి పెడుతోంది. కేటాయించిన ప్లాట్లను రిజిస్ట్రర్ చేయించుకోమనటం ఒత్తిడి పెట్టినట్లు ఎలా అవుతుందని అనుమానం వస్తోందా? ఇక్కడే ఉంది అసలు మతలబు.

రాజధాని నిర్మాణం కోసం 29 గ్రామాల్లోని రైతులు సుమారు 35 వేల ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చారు. అందుకు గాను రైతులు ఉండటానికి ప్లాట్లను కేటాయిస్తామని చంద్రబాబునాయుడు చెప్పారు. పూర్తిస్ధాయిలో అభివృద్ధి చేసిన ప్లాట్లను అంటే రోడ్లు, నీటి సౌకర్యం, వీధిలైట్లు, డ్రైనేజి, విద్యుత్ లాంటివి ఏర్పాటు చేసి ప్లాట్లను ఇస్తామని ఎన్నిసార్లు చెప్పారో లెక్కలేదు.

అయితే, తెర వెనుక ఏం జరిగిందో తెలీదు. హటాత్తుగా రైతులకు ప్లాట్లను కేటాయించేసామని, కాబట్టి వాటిని రిజిస్టర్ చేయించుకోవాలంటూ సిఆర్డీఏ అధికారులు రైతులకు నోటీసులిచ్చారు. దాంతో రైతులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. తమకు ప్లాట్లు ఎక్కడ ఇచ్చిందీ చెప్పకుండానే రిజిస్టర్ చేయించుకోమంటే ఎలా అని అడుగుతున్నారు. పైగా తమకు వాస్తు ప్రకారం ఉన్న ప్లాట్లే కావాలని రైతులు పట్టుపడుతున్నారు.

ప్లాట్లు రిజిస్టరైనట్లు రైతులు గనుక సంతకాలు పెట్టేస్తే వారికి కేటాయించే ప్లాట్లను ఎక్కడ ఇస్తారో ఎవరూ చెప్పటం లేదు. వాస్తు సంగతి దేవుడెరుగు స్మశానాలను కూడా చదునుచేసి ప్లాట్లుగా విభజించి ఇచ్చేస్తున్నట్లు పలువురు రైతులు ఘొల్లుమంటున్నారు. ఈ పరిస్ధితిల్లో తాము ప్రభుత్వం చెబుతున్నట్లు ప్లాట్లను తీసుకునేది లేదని రైతులు తెగేసి చెబుతుండగా, ప్రభుత్వమేమో రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు రైతులు రావాల్సిందేనంటూ ఒత్తిడి తెస్తోంది. ఒకసారి ప్లాట్లను రిజిస్టర్ చేయించుకుంటే, ఇక మౌళిక సదుపాయాల కల్పన అన్నది ఉత్తమాటే. ఏం జరుగుతుందో చూడాలి?