ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చే ఘటనలేవైనా జరిగితే వెంటనే బాధ్యునిగా ప్రభుత్వానికి జగనే గుర్తుకు రావటం గమనార్హం.

అన్నింటికీ పాపాల భైరవుడుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డే కనబడుతున్నాడు. రాష్ట్రంలో ఏదైనా మంచి జరిగితే చంద్రబాబునాయుడు ఘనత. చెడు జరిగితే వెంటనే అందుకు బాధ్యుడు జగన్. ప్రభుత్వ వాదన అలాగే కనిపిస్తోంది. తాజాగా వెలగపూడిలోని సచివాలయం, అసెంబ్లీ భవనాలు 30 నిముషాల వర్షానికి వణికిపోయాయి. ఏకధాటిగా కురిసిన వానకు సచివాలయంలోని పలు భవనాలతో పాటు అసెంబ్లీలోని జగన్ ఛాంబర్ నీటి మడుగైపోయింది.

అసెంబ్లీలోని ఇంకెన్ని ఛాంబర్లు నీట ముణిగిపోయాయో తెలీదు. ఎందుకంటే, మీడియాను, వైసీపీ ఎంఎల్ఏలను ఎవరినీ లోపలకు అనుమతించటం లేదు ప్రభుత్వం. నిత్యం పారదర్శకత గురించే మాట్లాడే చంద్రన్న ప్రభుత్వం తీరే అంత. కాబట్టి ఎవరూ మాట్లాడేందుకు లేదు. సరే, నిర్మాణాలు నాసిరకమని ప్రభుత్వం ఎందుకు ఒప్పుకుంటుంది? అందుకే కుట్రకోణాన్ని బయటకు తీసింది. రేపో మాపో కుట్ర వెనుక వైసీపీనే ఉండని చెప్పినా ఆశ్చర్యం లేదు.

రాజధాని ప్రాంతంలో గ్రామాల్లోని రైతులు రాజధాని కోసం తమ భూములిచ్చేది లేదని గతంలో తేల్చిచెప్పారు. వారిని భయపెట్టైనా సరే దారికి తెచ్చుకోవాలనుకున్నది ప్రభుత్వం. ఇంతలో కొందరు రైతుల పొలాలు తగలబడ్డాయి. పొలాలు తగలబడగానే ఇది జగన్ పనే అంటూ చంద్రబాబు, మంత్రులు తేల్చేసారు. ఇది జరిగి సుమారు ఏడాదిన్నరైపోయింది. పోలీసులు విచారణ జరుపుతున్నా బాధ్యులెవరో తేలలేదు. మరెందుకు అరెస్టు చేయలేదంటే సమాధానం చెప్పరు.

అదేవిధంగా దాదాపు ఏడాది క్రితం తునిలో రత్నాచల్ రైలు తగలబడింది. ఘటన జరగ్గానే ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. ఘటన జరిగిన మరుసటి రోజే జగనే బాధ్యుడంటూ చంద్రబాబు, మంత్రుల ఆరోపణలు షరా మామూలే. మరరెందుకు చర్యలు తీసుకోవటం లేదంటే మౌనమే సమాధానం. అంటే ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చే ఘటనలేవైనా జరిగితే వెంటనే బాధ్యునిగా ప్రభుత్వానికి జగనే గుర్తుకు రావటం గమనార్హం.