మొత్తానికి రైతు బిడ్డ చంద్రబాబు చేతిలో  మిగిలిన రైతులకు మంచి సత్కారమే లభిస్తోంది.

రాష్ట్రంలోని రైతుల గతి అధోగతే. ఎందుకంటే, కేంద్ర భూసేకరణ చట్టం-2013కు రాష్ట్ర ప్రభుత్వం అనేక సవరణలు చేసేసింది. చట్టానికి సవరణలంటే తనకు అనుకూలంగా ఉండేట్లు చూసుకుంటుందనటంలో అనుమానమే లేదు. అయితే, ఈ చట్ట సవరణ చెల్లుతుందా చెల్లదా అన్నది వేరేసంగతి. తెలంగాణాలో భూ సేకరణ చట్టం-2013 స్ధానంలో జిఓ నెంబర్ 133ను తెస్తే కోర్టు కొట్టేసింది. భూ సేకరణ చట్టాన్ని యాధాతథంగా అమలు చేయాల్సిందేనంటూ తలంటిపోసింది. బహుశా ఇక్కడ కూడా అదే జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

చట్టానికి సవరణలు ఎందుకంటే, 10 లక్షల ఎకరాల సేకరణను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. అన్ని లక్షల ఎకరాలంటే రైతుల నుండి సేకరించటం మినహా వేరే దారిలేదు కదా? ఇప్పటికే లక్షల ఎకరాలు రియల్ ఎస్టేట్ గా మారిపోయింది. ఇక, ప్రభుత్వం కూడా లక్షల ఎకరాల సేకరణంటే రైతులు, పంటలు, వ్యవసాయ రంగం ఏమవుతుందో ఊహించేందుకే బాధగా ఉంది. లక్షల ఎకరాలతో భారీ ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసి పరిశ్రమలకు కట్టబెట్టాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం.

రాజధాని కోసం 50 వేల ఎకరాల సమీకరించాలనుకున్నప్రభుత్వ లక్ష్యం పూర్తిగా నెరవేరలేదు. అందుకనే ఇప్పటికి 34 వేల ఎకరాలతో సరిపెట్టుకుంది. బందర్ పోర్టు విస్తరణ, భావనపాడు పోర్టు, భోగాపురం విమానాశ్రయం ఏర్పాటు తదితరాల కోసం లక్షల ఎకరాల్లో భూములు అవసరం. భూములు లేకుంటే చంద్రబాబునాయుడు ప్రణాళికల అమలు సాధ్యం కాదు. రైతులేమో భూములు ఇవ్వమంటున్నారు. అదే విధంగా రాజధాని చుట్టూ ఏర్పాటు కానున్న రింగ్ రోడ్డు నిర్మాణానికి భూములు ఇవ్వటానికి రైతులు తీవ్ర వ్యతిరేకత కనబరుస్తున్నారు. ఈ పరిస్ధితుల్లో భూములను ఏ విధంగా సేకరించాలో ప్రభుత్వానికి అర్ధం కావటం లేదు.

అందుకనే, రైతుల సమ్మతి అవసరం లేకుండానే సేకరణ చేయటానికి వీలుగా భూ సేకరణ చట్టానికి ప్రభుత్వం సవరణలు చేసింది. అందుకు అవసరమైన బిల్లు అసెంబ్లీలో పాస్ చేసుకున్నది. సరే, ప్రభుత్వం సవరణలు చేసుకుంటే సరిపోదనుకోండి అది వేరే సంగతి. అయితే, సవరించిన చట్టం ప్రకారం భూ సేకరణకు ప్రభుత్వం దిగితే మాత్రం రైతుల గతి అధోగతే. ప్రజాభిప్రాయ సేకరణ అవసరం లేదు. 80 శాతం ప్రజల ఆమోదంతో పనేలేదు. ప్రభుత్వం ఇచ్చినంత నష్టపరిహారాన్ని రైతులు తీసుకుంటే తీసుకున్నట్లు. లేకపోతే వారి పేర్లతో కోర్టుల్లో డిపాజిట్ చేస్తుంది ప్రభుత్వం. మొత్తానికి రైతు బిడ్డ చంద్రబాబు చేతిలో రైతులకు మంచి సత్కారమే లభిస్తోంది.