అమరావతి: మూడు రాజధానుల ఏర్పాటు అనే పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఎ బిల్లులపై గవర్నర్ హరిచందన్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమైన పరిణామం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గవర్నర్ వద్దకు ఓ సీనియర్ మంత్రిని, ఉన్నతాధికారులను పంపించారు. వారు ఆ బిల్లులపై గవర్నర్ కు వివరణ ఇచ్చారు. 

ఆమోదం కోసం ఆ రెండు బిల్లులను జగన్ ప్రభుత్వం ఇటీవల గవర్నర్ కు పంపించిన విషయం తెలిసిందే. అయితే, వాటిపై గవర్నర్ నిర్ణయం ఇప్పటి వరకు వెలువడలేదు. ఆ బిల్లులపై గవర్నర్ ఇప్పటికే న్యాయ సలహా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో గవర్నర్ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. 

ఆ బిల్లులపై శాసన మండలి ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని, శాసన మండలిలో బిల్లులు ప్రతిపాదించిన తర్వాత ఆ వాటిపై నిర్ణయం తీసుకోవాల్సిన గడువు దాటిపోయిందని, అందువల్ల వాటిని శాసన మండలి ఆమోదించినట్లుగానే భావించాలని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే, మొదటి సారి బిల్లులను శాసన మండలికి పంపినప్పుడు వాటిని చైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపించారు. 

ఆ బిల్లులపై శాసన మండలి నిర్ణయం విషయంలో తీవ్రమైన గందరగోళం నెలకొన్న నేపథ్యంలో వాటిపై ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో గవర్నర్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, రాజ్యాంగపరమైన, న్యాయపరమైన చిక్కులు ఎదురు కాకుండా చూసుకునే ఉద్దేశంతో వాటి విషయంలో గవర్నర్ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. 

అయితే, రాజధాని అమరావతిలోనే కొనసాగాలని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేతలు వాదిస్తున్నారు. రాజధానిని మార్చాలంటే ఏపీ పునర్వ్యస్థీకరణ చట్టానికి సవరణలు చేయాల్సి ఉంటుందని, అందువల్ల అది కేంద్ర పరిధిలోదే తప్ప రాష్ట్ర పరిధిలోది కాదని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అంటున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి నెలకొని ఉంది.