విజయవాడను పర్యాటక నగరంగా అభివృద్ది రూ.16 కోట్లతో భవానీ ద్వీపంలో లేజర్‌ షో 


 విజయవాడను పర్యాటక నగరంగా తీర్చిదిద్డనికి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందుకోసం భవానీ ద్వీపాన్ని అభివృధ్ది చేయడానికి భవానీ ఐలాండ్‌ టూరిజం కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తోంది. నదీ తీరాన గల ఈ ప్రాంతంలో మల్టీమీడియా లేజర్‌ షోను ఏర్పాటు చేసి సందర్శకులను ఆకట్టుకునేలా ప్రణాళికలు రచిస్తోంది ఏపీ ప్రభుత్వం.
లేజర్‌ షోలకు గోదావరి, కృష్ణా పుష్కరాల సమయంలో మంచి స్పందన రావడం మనం చూశాం.దీంతో ప్రభుత్వం శాశ్వతంగా ఒక ప్రాంతాన్ని లేజర్ షో ప్రదర్శనకు కేటాయించాలనుకుంది.అందుకోసం భవానీ ద్వీపాన్ని ఎంచుకుంది.
ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే ద్వీపానికి వన్నె తెచ్చేలా ఏర్పాట్లు చేయనున్నట్లు టూరిజం కార్పొరేషన్‌ తెలిపింది. లేజర్‌షో తో పాటు మ్యూజికల్‌ ఫౌంటేన్‌ ఏర్పాటు చేసి నగర వాసులకు కనువిందు చేయనున్నారు. 
 ఈ మల్టీమీడియా లేజర్‌షో లో నీటిపై కిరణాలు పడి కనువిందు చేయనుంది. నీటిపై వివిధ రకాల రంగుల్లో లేజర్‌ కిరణాలను వదిలి, సన్నివేశానికి తగ్గట్లుగా సంగీతం అందిస్తారు. రాత్రి సమయంలో మాత్రమే ఈ షో నడుస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో మొదటి సారిగా భవానీ ద్వీపంలో అందుబాటులోకి తేనున్న ఈ ప్రజెక్టు కోసం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం రూ.16 కోట్లు కేటాయించింది. గుత్తేదారులు పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది పూర్తయితే ద్వీపం కొత్త రూపు సంతరించుకుని పర్యాటక అభివృద్దికి దోహదపడనుంది.