రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ టీడీపీ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఎం చిటికెల సందీప్ ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సందీప్ ను పోలీసులు శ్రీశైలంలో అదుపులోకి తీసుకున్నారు. హుకుంపేట వినాయకుడి విగ్రహానికి మలినం పూసిన ఘటనపై మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేశాడని సందీప్ మీద ఆరోపణలు వచ్చాయి. 

ఇదే ఘటనలో పోలీసువలు తొలుత టీడీపీ నేత బాబూఖాన్ చౌదరిని అరెస్టు చేశారు. కానీ ఈ విషయంలో బుచ్చయ్య చౌదరి పీఎ సందీప్ హస్తం ఉందని పోలీసులు గుర్తించారు. దీంతో అతన్ని అరెస్టు చేయడానికి అప్పటి నుంచి పోలీసులు ప్రయత్నించారు. 

పోలీసుల ప్రయత్నాన్ని కనిపెట్టిన సందీప్ పరారీలో ఉన్నాడు. పరారీలో ఉన్న అతను శ్రీశైలంలో ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు బుధవారంనాడు అరెస్టు చేశారు. ఆ తర్వాత అతన్ని కోర్టులో హాజరు పరిచారు. 

సందీప్ కు కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో మరి కొందరిపై కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.