Asianet News Telugu

ఆ విషయంలో కేసీఆర్ సర్కార్ భేష్... జగన్ సర్కార్ పరిస్థితి ఇదీ: మాజీ మంత్రి యనమల

ఆంధ్ర ప్రదేశ్ ఫైనాన్సియల్ మేనేజ్ మెంట్ ఘోరంగా వుందని... ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం బెటర్ అని మాజీ ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. 

good financial management in telangana...very bad in ap... yanamala ramakrishnudu  akp
Author
Amaravati, First Published Jul 8, 2021, 3:06 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ బహిరంగ మార్కెట్ రుణ పరిమితిలో కేంద్ర ప్రభుత్వం భారీ కోత విధించినా జగన్ ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోవడం లేదని మాజీ ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఏప్రిల్ మాసంలో రాష్ట్ర ఆర్ధిక శాఖ సమర్పించిన సమగ్ర అప్పుల నివేదిక చూసి కేంద్ర అధికారులే విస్తుపోయారన్నారు యనమల.  

''2021-22 ఆర్ధిక సంవత్సరానికి  42,472 కోట్లు బహిరంగ మార్కెట్ లో రుణం పొందడానికి ఏపీకి అనుమతించింది కేంద్రం. ముందు సంవత్సరాల రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 4 శాతం కన్నా అధికంగా అంటే రూ. 17,924 కోట్ల రూపాయలు అప్పులు ముందే చేశారని రుణ పరిమితిలో కోత పెట్టారు. అంతేకాకుండా ఇతరత్రా అప్పుల రూపంలో అదనంగా మరో రూ. 6,000 కోట్ల రూపాయలు వాడుకున్నారు. అంతాపోగా 2021-22 ఆర్ధిక సంవత్సరానికి రాష్ట్రానికి మిగిలిన రుణ పరిమితి కేవలం రూ. 27,668 కోట్లే'' అని యనమల వివరించారు. 

''రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన డిల్లీలో అప్పుల కోసం చక్కర్లు కొట్టిన కొద్ది రోజుల్లోనే కేంద్రం రుణ పరిమితిలో కోత పెట్టడం ప్రభుత్వానికి ఒక లెంపకాయ లాంటిది. రాష్ట్ర మూలధన వ్యయం చాలా తక్కువగా ఉంది... దానిని తక్షణం పెంచాలని చెప్పినా ప్రభుత్వం ఆ దిశగా పనిచేయడం లేదు. ఎన్.కె. సింగ్ నేత్రత్వంలోని ఎఫ్.ఆర్.బి.ఎం రివ్యూ కమిటీ ఏప్రిల్ 2020 లోనే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ముందే హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదు.  కమిటీ ఫైనాన్సియల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్ మెంట్ పై అధ్యయనం చేసింది. రాష్ట్రాలు జి.ఎస్.డి.పి లో అప్పు నిష్పత్తి 20 శాతం మించితే బ్యాడ్ ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ గా నిర్ణయించింది. ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిష్పత్తి 17 శాతం కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత దారుణంగా 31.46  శాతం గా ఉందని చెప్పింది. దేశంలోనే అప్పు భారం అధికంగా ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉండటం జగన్ దివాలకోరు ఆర్ధిక విధానాలకు నిదర్శనం'' అని మండిపడ్డారు.

read more  ప్రగతిభవన్లో బిర్యానీ పెట్టి కేసీఆర్ కోరారు... జగన్ చేశారు: పోలవరంపై దేవినేని ఉమ సంచలనం

''జగన్ ఇదే తీరు కొనసాగిస్తే రాబోయే రోజుల్లో ఏపీలో క్లిష్టమైన పరిస్థితులు నెలకొంటాయి. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో-ఆర్థిక అసమానతలు మరింత పెరిగుతాయి. అధిక వడ్డీలకు అప్పులు చేయడం వల్ల భవిష్యత్తులో మరింత  పన్నుల భారం పడనుంది. పెంచే పన్నులు ధరల పెరుగుదల వల్ల పేద, మధ్య తరగతి బ్రతుకులు తల్లక్రిందులౌతాయి. ఉద్యోగులకు సకాలంలో జీతాలు రావు. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయరు. ఎస్సీ, ఎస్టీ. బీసీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయరు'' అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. 

''2019లో చంద్రబాబు నాయుడు అధికారం నుంచి తప్పుకునే నాటి రాష్ట్ర నిరుద్యోగ శాతం 3.6 శాతం ఉండగా జగన్ దానిని 13.5 శాతంకు పెంచారు. నేడు నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడటం జగన్ పాపమే. చంద్రబాబు ప్రభుత్వం ఏడాదికి సరాసరి రూ. 26,000 కోట్లు అప్పు చేసి ఎన్నో అభివృద్ధి పనులు చేసింది. జగన్ ప్రభుత్వం ఏడాదికి సరాసరి రూ. 70,000 కోట్లు అప్పు చేస్తున్నా అభివృద్ధి లేదు'' అని ఆరోపించారు. 

''టిడిపి ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వంలా భారీగా పన్నులు పెంచలేదు. మధ్యం, ఇసుక, సిమెంటు, విద్యుత్ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఆస్తి పన్ను పెంపు, పెట్రోల్, డీజీల్ రేట్ల పెంపు ద్వారా వేల కోట్లు ప్రజలపై భారం మోపారు. నిత్యావసర సరుకుల ధరలు పెంచారు. చివరకు రేషన్ సరుకుల ధరలు కూడా పెంచారు. తెచ్చిన అప్పులు వేస్తున్న పన్నులు, పెంచిన ధరల వల్ల ఒకొక్క కుటుంబం పై రూ. 2.5 లక్షల భారం మోపారు. లక్షల కోట్ల ప్రభుత్వ నిధులు ఏమయ్యాయి? సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తున్నామనే ప్రచారం కూడా నిజం కాదు. టిడిపి ప్రభుత్వం కన్నా వైసీపీ ప్రభుత్వం సంక్షేమానికి ఎక్కువేమీ ఖర్చు చేయడం లేదు. రైతు రుణమాఫీ రద్దు, అన్నా క్యాంటీన్లు, నిరుద్యోగ భ్రుతి, పండుగ కానుకలు, విదేశీ విద్య లాంటి 34 టిడిపి సంక్షేమ పథకాలను రద్దు చేశారు. ఉద్యోగులు పెన్షన్ దారుల జీతాలు, సంక్షేమం కూడా తెలుగుదేశం ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం దిగదుడుపే. మరి ప్రభుత్వ నిధులు ఏమయ్యాయి?'' అని నిలదీశారు. 

''వైసీపీ నేతల అవినీతి, దుబారా వల్ల నేడు ప్రభుత్వ ఖజానా దివాలా తీసింది. హోల్ సేల్ అవినీతి డబ్బు పంప్ చేయడం వల్ల వైసీపీ నేతల కంపెనీలు కళకళలాడుతున్నాయి. పెరగిన భారాలతో ప్రజలు వెలవెల బోతున్నారు. ప్రభుత్వ హోల్ సేల్ అవినీతి, దుబారా తగ్గించుకుంటే భారీగా పన్నలు పెంచవలసిన అవసరం, అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సిన అవసరం రాదు. ధరలు పెంచాల్సిన పని లేదు. కనుక ప్రభుత్వం ఆర్ధిక క్రమశిక్షణ పాటించాలి. అవినీతి దుబారాను అరికట్టాలి. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. సంక్షేమ పథకాలలో కోతలు కోయరాదు. పి.ఆర్.సి అమలు చేయాలి. 2.3 లక్షల ప్రభుత్వ శాఖల ఖాళీల భర్తీకి రీ –నోటిఫికేషన్ ఇవ్వాలి. రైతుల బకాయిలను వెంటనే చెల్లించాలి'' అని యనమల సూచించారు. 

                                 
 
 

Follow Us:
Download App:
  • android
  • ios