ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే వయస్సు గరిష్ట పరిమితిని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే వయస్సు గరిష్ట పరిమితిని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గడచిన రెండున్నరేళ్ళుగా ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలంటూ చాలా తక్కువ. పైగా చంద్రబాబునాయడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే ఉద్యోగ విరమణ చేయనున్న ఉద్యోగుల కాలపరిమితిని రెండేళ్ళు పెంచారు. దాంతో 2014 జూన్ మాసం తర్వాత ఉద్యోగ విరమణ చేయాల్సిన వారికంతా రెండేళ్ల సర్వీసు పెరిగింది.

దాంతో నిరుద్యోగులకు మండింది. అప్పటి నుండి ఏదో ఒక రూపంలో ఉద్యోగాల భర్తీకి ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. అయితే, ఉద్యోగ భర్తీకి చర్యలు తీసుకోని ప్రభుత్వం ఎట్టకేలకు నిరుద్యోగుల వయో పరిమితిని మాత్రం ఏకంగా ఎనిమిదేళ్లు పెంచటం గమనార్హం. మామూలుగా ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రస్తుత వయోపరిమితి 34 ఏళ్ళు. దాన్ని 42 సంవత్సరాలకు పెంచుతూ ఇటీవలే జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది.

ఈ వయో పరిమితి పెంపు అన్నీ ఉద్ద్యోగాల ప్రవేశ పరీక్షలకూ వర్తిస్తుంది. ఉత్తర్వుల ప్రకారం 2017 సెప్టెంబర్ 30వ తేదీ వరకూ భర్తీ చేసే ఉద్యోగాలకు మాత్రమే ఈ పరిమితి వర్తిస్తుందని కూడా ప్రభుత్వం మెలిక పెట్టటం గమనార్హం.