లాక్‌డౌన్ వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న చేనేత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.

ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ఇలా ప్రతి ప్రాంతంలో చేనేత వృత్తిపై ఆధారపడ్డ కుటుంబాలు లక్షల్లో ఉన్నాయని పవన్ గుర్తుచేశారు. చేనేత కళాకారులకు ఏ రోజు పనిచేస్తే ఆ రోజే కుటుంబం గడిచే పరిస్ధితులు ఉంటాయని.. లాక్‌డౌన్ కారణంగా వీరికి పూట గడవటం ఇబ్బందిగా మారిందన్నారు.

Also Read:కష్టాల్లో స్నేహితుడు.. ఆదుకోబోతున్న పవన్ కళ్యాణ్ !

చేనేత కుటుంబాలు కష్టాల్లో ఉన్నాయని.. వారి ఈతి బాధలను తెలియజేస్తూ జనసేన కార్యాలయానికి విజ్ఞాపనలు అందుతున్నాయని పవన్ కల్యాణ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల కుటుంబాలు చేనేతపై ఆధారపడి ఉన్నాయని.. అయితే ప్రభుత్వం గత ఏడాది నేతన్న పథకంలో 83 వేల మందికే ఆర్ధిక సాయం చేసిందని జనసేనాని గుర్తుచేశారు.

లాక్‌డౌన్ కారణంగా ఈ రంగాన్ని నమ్ముకున్న వారి జీవితాలకు భరోసా లేకుండా పోతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయంగా ప్రతి కుటుంబానికి రూ.10 వేలు ఆర్ధిక సాయం అందించాలని చేనేత కుటుంబాలు కోరుతున్నాయని పవన్ కల్యాణ్ తెలిపారు.

Also Read:ప్రధాని ఆదేశాలనే పట్టించుకోని టిటిడి...ఆ నిర్ణయం తగదు: పవన్ కల్యాణ్

వారి డిమాండ్ సహేతుకమైనదే కాని... లాక్‌డౌన్ అనంతరం వారి జీవనోపాధికి అవసరమైన మార్గాలను చూపడంతో పాటు వారికి కావాల్సిన ముడిసరకును అందించాల్సిన బాధ్యతను రాష్ట్ర జౌళి శాఖ చేపట్టాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. నేతన్న నేస్తం పథకాన్ని కొందరికి మాత్రమే పరిమితం చేయకుండా ఈ వృత్తిపై ఆధారపడ్డ వారందరికీ అమలు చేయాలని జనసేనాని కోరారు.