రాజోలు: పోకిరీలు వేధింపులు తట్టుకోలేక ఓ విద్యార్థి తన నిండు ప్రాణాలు బలితీసుకుంది. చదువుకోవాలని ఎంతో ఆశతో కళాశాలకు వెళ్లింది. అయితే ప్రేమపేరుతో పోకిరీ వేధింపులు ఆమెను ప్రాణాలు తీసుకునేలా చేశాయి.  

రెండేళ్లుగా ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధిస్తున్నాడు. వాట్సప్ స్టేటస్ లో ఆ విద్యార్థిని ఫోటో పెట్టుకుని మానసికంగా హింసించాడు. కళాశాలకు వెళ్లేటప్పుడు యువతి బస్సు వెంట వచ్చి మరీ వేధింపులకు పాల్పడేవాడు. 

బస్సులో ప్రయాణిస్తుండగా విద్యార్థినికి ప్రేమ లేఖలు విసరడం, చాక్లెట్లు ఇవ్వడం ఇలా నిత్యం వేధింపులకు గురి చేశాడు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కుమార్తె ఆత్మహత్యకు పాల్పడటంతో ఆ తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు అందరిని కంటతడిపెట్టిస్తోంది. 

ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా గోగన్నమఠంలో చోటు చేసుకుంది. మధుశ్రీ అనే విద్యార్థి ఇంటర్ మెుదటి సంవత్సరం చదువుతోంది. అయితే అదే గ్రామానికి చెందిన రాజేష్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. 

తొమ్మిదో తరగతి నుంచి మధుశ్రీని రాజేశ్ వేధింపులకు గురి చేశాడని ఆరోపిస్తున్నారు. దాంతో మధుశ్రీ కుటుంబ సభ్యులు గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో వారంతా మందలించారు. అయినప్పటికీ రాజేష్ తీరులో మార్పు రాకపోవడంతో తల్లిదండ్రులు మధుశ్రీని బంధువుల ఇంట్లో ఉంచి చదివించారు. 

ఇంటర్ కావడంతో ఇటీవలే మళ్లీ గోగన్నమఠం వచ్చింది. కళాశాలకు వెళ్తున్న ఆమెను వేధించడం మళ్లీ మెుదలుపెట్టాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తనను ప్రేమించకపోతే చంపేస్తానంటూ బెదిరించాడని కూడా ఆరోపిస్తున్నారు. అటు చదువును వదులుకోలేక, ఆ వేధింపులు భరించలేక శుక్రవారం మధుశ్రీ ఇంటి వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 

కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు రాజేష్ పరారీలో ఉన్నాడు. అతనిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇకపోతే రాజేశ్ ను కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.