కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. పాల ప్యాకెట్ కోసం వెళ్లిన బాలిక డ్రైన్ లో జారిపడి మృత్యువాత పడింది. బాలికను కాపాడేందుకు స్థానికులు పెద్ద యెత్తున గాలించినా ఫలితం దక్కలేదు. తూర్పు గోదావరి జిల్లా మండపేటలో ఈ ఘటన జరిగింది. 

మండపేటకు చెందిన పలివెల దుర్గాప్రసాద్, పల్లవి దంపతులకు కూతురు (7), కుమారుడు ఉన్నారు. మండపేటలోని మూడో వార్డులోని ఓ ఇంటిలో కుటుంబం అద్దెకు ఉంటుంది. దుర్గాప్రసాద్ వడ్రంగి పనిచేస్తూ ఉంటాడు. స్థానికంగా ఉన్న రామాహిందూ మున్సిపల్ స్కూల్లో చంద్రకళ రెండో తరగతి చదువుతోంది. 

ఆదివారం సాయంత్రం పాల ప్యాకెట్ కోసం పోలీసు స్టేషన్ సమీపంలోని దుకాణానికి వెళ్లింది. అప్పటికే భారీ వర్షం కురుస్తోంది. దుకాణం సమీపంలోని మంగళిబోదె కాలువలో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. రోడ్డు నుంచి కూడా ముంపు నీరు ప్రవహిస్తుండడంతో చంద్రకళ చెప్పు జారిపోయింది. దాన్ని తీసుకునే ప్రయత్నంలో చంద్రకళ నీటి వేగానికి మురుగు కాలువలో కొట్టుకుపోయింది.

ప్రమదాన్ని గమనించిన ఇద్దరు చిన్నారులు బాలిక ఇంటికి వెళ్లి ఆమె తల్లికి విషయం చెప్పారు. దాంతో ఆమె పరుగెత్తుకుంటూ కాలువ వద్దకు వచ్చింది. తన బిడ్డను కాపాడాలంటూ ఆమె కేకలు వేయడంతో స్థానికులు ముందుకు వచ్చి ప్రయత్నాలు చేశారు. 

కిలోమీటరు దూరంలో బాలిక దొరికింది. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మరణించినట్లు వైద్యులు తేల్చి చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.