గరగపర్రు సమస్యను పరిష్కరించిన మంత్రులు చేయి చేయి కలిపిన గ్రామస్తులు
ఎట్టకేలకు గరగపర్రు సమస్య పరిష్కారమైంది.ఆ గ్రామస్తులు దళితులపై చూపిన వివక్షపై వైరం చెలరేగిన అంశం మనకు తెలిసిందే. సంఘటన గత రెండు నెలలుగా పశ్చిమ గోదావరి జిల్లాలో వివాదాస్పదంగా మారింది. ఈ వివాదం ఎట్టకేలకు మంత్రుల రాకతో సద్దుమనిగింది. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి భాదిత దళితులను కలిసి, సమస్య పరిష్కారానికి ప్రయత్నించినా ఆ చర్చలు పలించలేవనే విషయం అందరికీ తెలిసిందే. అయితే రాష్ట్ర మంత్రులు నక్కా ఆనందబాబు, పితాని సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌ల పర్యటనతో ఈ వివాదానికి తెరపడింది.
గరగపర్రులో పర్యటించిన మంత్రులు దళితులు, వారిని బహిష్కరించిన వర్గాలతో చర్చలు జరిపారు. దాదాపు ఎనిమిది గంటలపాటు చర్చించి గ్రామంలోని దళిత,దళితేతర సామాజిక వర్గాల మద్య వున్న విభేదాలకు తెరదించారు. ఈ సంఘటనలో బాధితులైన కుటుంబాలకు రూ.లక్ష చొప్పున పరిహారం అందిస్తామని మంత్రులు తెలిపారు.
మంత్రుల సమక్షంలోనే ఇరువర్గాలు పరస్పరం చేతులు కలుపుకుని,ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇప్పటినుంచి దళితులపై వివక్షను తగ్గించుకుని సోదర భావంతో మెలుగుతామని గ్రామ పెద్దలు తెలిపారు.
గ్రామంలో నిమ్న వర్గాలకు పనులివ్వడానికి నిరాకరించిన వర్గాలే, ఇపుడు పనులకు పిలిచేందుకు అంగీకరించారని జూపూడి తెలిపారు. ప్రభుత్వం చొరవచూపడం వల్లే వివాదం ఇంత తొందరగా పరిష్కారమైందని గరగపర్రు గ్రామస్తులు తెలిపారు.
అలాగే ఆక్రమణలకు గురైన దళితుల స్మశానవాటిక భూమి సమస్యను పరిష్కరిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. దళితవాడల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ సౌకర్యం ఏర్పాటుతో పాటు, అర్హులందరికి ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, గ్రామస్తులంతా కలిసికట్టుగా ఉండి గ్రామాభివృద్దిలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.
