జగన్ బలహీనమైన నాయకుడని తేలింది: మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణపై గంటా శ్రీనివాసరావు
ఏపీ రాష్ట్ర మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణతో జగన్ ఎంత బలహీనమైన నాయకుడో తేలిపోయిందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. కేబినెట్ లో చోటు దక్కని వారి అనుచరులు సీఎం దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం తాను ఏనాడూ చూడలేదన్నారు.
విశాఖపట్టణం: జగన్ బలహీనమైన నాయకుడని మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణతో తేలిపోయిందని మాజీ మంత్రి Ganta Srinivasa Rao విమర్శించారు.
జగన్ బలమైన నాయకుడనే భ్రమలు తొలగిపోయాయన్నారు. AP Cabinet Reshuffle తర్వాత సీఎం దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం తాను ఏనాడూ చూడలేదన్నారు. కేబినెట్ లో చోటు దక్కని వారి అనుచరులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయడాన్ని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. సామాజిక సమతుల్యత పేరుతో ప్రధాన నగరాలతో పాటు ఎనిమిది జిల్లాలకు మంత్రులే లేకుండా చేశారని గంటా శ్రీనివాసరావు విమర్శించారు.
రాష్ట్రంలోని విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి నగరాలతో పాటు మరో ఎనిమిది జిల్లాలకు మంత్రులే లేరన్నారు. ఎన్నికలకు రెండేళ్ల ముందు మంత్రివర్గంలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చామంటే వైసీపీని ప్రజలు నమ్ముతారా అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా కూడా బీసీలు టీడీపీకి అండగా ఉంటారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు.
కొన్ని విషయాలనుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు గాను జిల్లాల విభజన అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెరమీదికి తెచ్చిందన్నారు. జిల్లాల విభజన అశాస్త్రీయంగా సాగిందని వైసీపీ ప్రజా ప్రతినిధులు ఆందోళనలు చేశారని ఆయన విమర్శించారు.
ఎన్నికలనాటికి TDPలోకి వలసలు వస్తాయన్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతారని ఆయన చెప్పారు. విద్యాశాఖపై సీఎం జగన్ నిర్వహించిన సమీక్షలో విద్యా శాఖ మంత్రి లేకపోవడంతో పాటు విద్యుత్ శాఖ మంత్రి ఈ సమీక్షలో పాల్గొనడం ఎలాంటి సంకేతాలు ఇస్తుందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మంత్రివర్గాన్ని పునర్వవ్యవస్తీకరించారు.11 మంది పాత మంత్రులకు మరోసారి చోటు కల్పించారు. 14 మంది కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చారు. తొలుత అంబటి రాంబాబు ప్రమాణం చేశారు. చివరకు విడుదల రజ.ని మంత్రిగా ప్రమాణం చేశారు. 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్‌లో చోటు దక్కింది. సామాజిక సమీకరణాల పరంగా చూస్తే బీసీ-10, కాపు-4, రెడ్డి-4, ఎస్సీ-5, ఎస్టీ-1, మైనార్టీ-1కి అవకాశం కల్పించారు.అయితే మంత్రివర్గంలో చోటు దక్కని కొందరు వైసీపీ ప్రజా ప్రతినిధులు అసమ్మతి గళం విన్పించారు..రాజీనామాలు చేస్తామని కూడా ప్రకటించారు. మంత్రి పదవి దక్కని అసంతృప్తులను వైసీపి నాయకత్వం చల్లబరిచింది.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జరిపిన చర్చలు ఫలించాయి. .సీఎం జగన్ తో బాలినేని శ్రీనివాస్ రెడ్డి సోమవారం నాడు భేటీ అయ్యారు. పార్టీ పదవిని సీఎం అప్పగిస్తారని చెప్పారన్నారు. ఏ బాధ్యత ఇచ్చినా కూడా తాను సమర్ధవంతంగా నిరవహిస్తానని చెప్పారు. ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మేకతోటి సుచరితలతో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ సమావేశమయ్యారు. ఇద్దరితో చర్చించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం నాడు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో భేటీ అయ్యారు. ఆ తర్వాత సీఎంతో కూడా ఆయన భేటీ అయ్యారు. పార్టీ బాధ్యతలను తాను నిర్వహిస్తానని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు. సామినేని ఉదయభాను కూడా నిన్ననే సీఎంతో భేటీ అయ్యారు. అయితే సీఎం చుట్టూ ఉన్న కోటరీ గురించి కూడా ఉదయభాను సీఎం వద్ద ఫిర్యాదు చేశారు. బుధవారం నాడు మాజీ హోం మంత్రి సుచరిత సీఎంతో భేటీ అయ్యారు.