డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఈ నెల 25 న విశాఖపట్నంలో భారీ ర్యాలీ తెలంగాణ సర్కారుకు డ్రగ్స్ కేసులో సాయం చేస్తామన్న గంటా
తెలంగాణ సర్కారుకు డ్రగ్స్ కేసులో విచారణకు సహాయం చేయడానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ సిద్దంగానే ఉంటుందని ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీని వెంటాడుతున్న డ్రగ్స్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన విషయాన్ని ఆయన గుర్తు చేసారు. విచారణ తో తమ ప్రభుత్వానికి సంబందం లేకున్నా, సినిమా ఇండస్ట్రీతో తనకున్న అనుభందం దృష్ట్యా దీనిపై మాట్లాడుతున్నానని ఏపీ మంత్రి తెలిపారు.
డ్రగ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా ఈ నెల 25 న విశాఖపట్నంలో భారీ ర్యాలీ చేపట్టనున్నట్టు మంత్రి తెలిపారు. మాదకద్రవ్యాల నియంత్రణ పై పాఠశాలల యాజమాన్యాలతో ఈ రోజు ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, డ్రగ్స్ వల్ల కలిగే దుష్ఫలితాలపై విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించనున్నామన్నారు.
డ్రగ్స్ నియంత్రణపై టోల్ ఫ్రీ నంబర్, టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మాదకద్రవ్యాల వ్యసనాన్ని నిరోదించడానికి కళాశాలల యాజమాన్యాలతో కూడా సమావేశం నిర్వహిస్తామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి రవాణను అడ్డుకోడానికి ప్రత్యేక పోలీస్ బలగాలను నియమించనున్నట్లు గంటా శ్రీనివాసరావు తెలిపారు.
