హైదరాబాద్: టికెట్ ఇచ్చిన పార్టీ పొమ్మనలేక పొగబెట్టింది. గెలిచిన పార్టీకి గుడ్ బై చెప్పేసి నచ్చిన పార్టీలోకి వెళ్దామంటే అక్కడ కండీషన్స్ అప్లై. మరోపార్టీ రమ్మని పిలుస్తున్నా వెళ్లలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తోచక తర్జనభర్జన పడుతున్నారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్.  

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఫిరాయింపులను తాను ప్రోత్సహించేది లేదని తేల్చి చెప్పేశారు. పార్టీ ఫిరాయింపులను నిరసించే తాను పాదయాత్రకు శ్రీకారం చుట్టానని అలాంటిది తాను ఎలా ఫిరాయింపులను ప్రోత్సహిస్తానంటూ తన మనసులో మాట చెప్పేశారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకునేవారు తమ పదవులకు రాజీనామా చేసి రావాల్సిందేనని స్పష్టం చేశారు. దాంతో వైసీపీలో చేరదామనుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు వెనక్కితగ్గారు. ఎంతో కష్టపడి గెలుచుకున్న ఎమ్మెల్యే పదవిని వదిలుకోవడానికి ఎవరూ సాహసించలేకపోయారు. 

పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్: వైసీపీ ఎంపీ నివాసంలో బస..?

అయితే తెలుగుదేశం పార్టీ కీలకనేత, గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ మాత్రం రాజీనామా చేసేందుకు సైతం వెనుకాడలేదు. తెలుగుదేశం పార్టీలో తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పొమ్మన కుండా పొగబెడుతున్నారంటూ ఆరోపిస్తూ ఆయన ఎమ్మెల్యే పదవికి, టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 

తన రాజీనామా వ్యవహారంపై నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశమైన వల్లభనేని వంశీమోహన్ వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంపై అనుచరులు కార్యకర్తలు సుముఖంగా లేకపోవడంతో ఆయన టీడీపీకి రాజీనామా చేశారు. 

టీడీపీకి రాజీనామా చేసిన అనంతరం వల్లభనేని వంశీమోహన్ టీడీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి నారా లోకేష్ వరకు ఎవర్నీ వదలకుండా నానా మాటలు అనేశారు. లోకేష్ ఎవరో తనకు తెలియదని పప్పు అంటేనే తనకు తెలుస్తుందంటూ కూడా లోకేష్ పై విరుచుకుపడ్డారు. 

ఏపీ అసెంబ్లీ సమావేశాలు సమీపిస్తున్న తరుణంలో ఏం చేయాలో అన్న పరిస్థితుల్లో తర్జనభర్జన పడుతున్నారు వల్లభనేని వంశీ. వైసీపీలోకి వెళ్లాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. రాజీనామా చేస్తే తన రాజకీయ భవిష్యత్ ఏంటన్నదానిపై గందరగోళంలో పడ్డారు. 

సీఎం జగన్ నుంచి ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పిస్తానని హామీ ఇస్తే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరదామని భావిస్తున్నారు. అయితే అందుకు జగన్ నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో తర్జనభర్జన పడుతున్నారట వల్లభనేని వంశీ.

ఏపీ రాజకీయాల్లో సంచలనం: జగన్ చెంతకు ముగ్గురు మిత్రులు, ఆ హామీపైనే వెయిటింగ్

జగన్ నుంచి ఎలాంటి హామీ రాకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ముందు చేరాలని ఆదేశిస్తే ఏంటన్న సందేహం వెంటాడుతుందట. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఇష్టం లేకపోతే టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేగా ఉండాల్సి వస్తుంది. 

ఇకపోతే బీజేపీ ఎంపీ సుజనా చౌదరి సైతం తమ పార్టీలోకి రావాలంటూ చర్చలు జరుపుతున్నారు. బీజేపీలోకి వెళ్తే ఎమ్మెల్యే పదవికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని అయితే స్పీకర్ తమ్మినేని సీతారాం మాత్రం ఇప్పటికే పలు హెచ్చరికలు జారీ చేశారు. 

నిబంధనలకు విరుద్ధంగా వంశీ వ్యవహరిస్తే వేటు వేస్తామని తేల్చి చెప్పారు. ఒకవేళ బీజేపీలో చేరినా స్పీకర్ వదిలిపెట్టేలా కనిపించడం లేదని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో వంశీ ముందున్న ఏకైక లక్ష్యం టీడీపీ రెబల్ ఎమ్మెల్యేగా ఉండటమే.

టీడీపీ రెబల్ ఎమ్మెల్యేగా ఉంటూ వైసీపీ సానుభూతిపరుడుగా వ్యవహరిస్తే నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవచ్చని తన నియోజకవర్గానికి వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదని వంశీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

అటో ఇటో ఏదో తేల్చండి: సీఎం జగన్ తో వంశీ భేటీ

గతంలో కూడా టీడీపీ ఇలాంటి వ్యూహాన్నే అమలు చేసింది. ఇద్దరు వైసీపీ ఎంపీలను తమ పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు నాయుడు వారిపై ఎక్కడ వేటు పడుతుందోనన్న ఆందోళనతో వారికి పార్టీ కండువాకప్పకుండా రెబల్ ఎంపీగానే ఉంచారు. 

2014 ఎన్నికల్లో కర్నూలు లోక్ సభ నియోజకవర్గం నుంచి గెలిచిన బుట్టా రేణుక, అరకు లోక్ సభ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కొత్తపల్లి గీతలు సైతం ఇలానే వ్యవహరించారు.  వైసీపీ నుంచి గెలుపొంది టీడీపీ సానుభూతి పరులుగా ఉంటూ వైసీపీకి కొరకరాని కొయ్యగా మారారు. 

ఇప్పుడు వల్లభనేని వంశీ విషయంలో కూడా ఇలాంటి ప్లాన్ అమలు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వంశీ టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేగా ఉంటూ ఒక రేంజ్ లో చంద్రబాబు, నారా లోకేష్ లను ఉతికి ఆరేస్తున్నారు. 

వల్లభనేని వంశీ మోహన్ వైసీపీకి సానుభూతి పరుడిగా ఉంటూ టీడీపీకి కొరకరాని కొయ్యగా మారుతారా లేక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరతారా లేకపోతే బీజేపీలో చేరతారా అన్నది కొద్దిరోజుల్లోనే తేలిపోనుంది.