అమరావతి: బెజవాడ రాజకీయాల్లో ముగ్గురు మిత్రులు ఎవరంటే ఠక్కున చెప్తారు కొడాలి నాని, వల్లభనేని వంశీ, వంగవీటి రాధాకృష్ణ. ముగ్గురు సామాజిక వర్గాలు వేరు అయినప్పటికీ వీరి స్నేహం మాత్రం ఇప్పటికీ అలాగే ఉంటుంది. 

పార్టీలు వేరైనా అంతా కలిసే ఉంటారు. వాస్తవానికి ముగ్గురు కలిసి ఏ పార్టీలోనూ లేరు అనడంలో సందేహమే లేదు. అయితే గతంలో తెలుగుదేశం పార్టీతో వంగవీటి కుటుంబానికి సంబంధాలున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. 

వంగవీటి రాధాకృష్ణ తండ్రి మరణానంతరం ఆయన తల్లి వంగవీటి రత్నకుమారి టీడీపీలో చేరారు. కానీ రాధాకృష్ణమాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అయితే  కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్ లు మాత్రం టీడీపీలోనే కొనసాగారు. 

అయితే వైయస్ జగన్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పుడు కొడాలి నాని టీడీపీతో విబేధించి వైసీపీలో చేరారు. అదే సమయంలో వంగవీటి రాధాకృష్ణ సైతం వైసీపీలో చేరారు. ఇద్దరూ వైసీపీలో ఉండగా వల్టభనేని వంశీమోహన్ మాత్రం టీడీపీలోనే కొనసాగారు. 

జగన్ మాట విని ఉంటే...తప్పులో కాలేసిన వంగవీటి రాధా

అయితే 2019 ఎన్నికలకు ముందు వరకు వైసీపీలో ఉన్న వంగవీటి రాధాకృష్ణ విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో అలిగి వైసీపీ వీడారు. వైసీపీకి గుడ్ బై చెప్పి సైకిలెక్కాశారు. అంతేకాదు తెలుగుదేశం పార్టీ స్టార్ కాంపైనర్ గా జగన్ కు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. 

అంతేకాదు సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలంటూ యజ్ఞాలు, యాగాలు కూడా చేశారు. అయితే ఊహించని రీతిలో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలవ్వగా వైసీపీ బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. 

2019 వరకు ప్రతిపక్షంలోనే ఉన్న వంగవీటి రాధాకృష్ణ అనంతరం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రతిపక్షానికే పరిమితమయ్యారు. వైసీపీ అధికారంలోకి రావడంతో రాజకీయాల్లో సైలెంట్ గా ఉన్నారు రాధా. 

పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్: వైసీపీ ఎంపీ నివాసంలో బస..?

అయితే తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్కొక్కరుగా ఇతర పార్టీలోకి వెళ్లిపోవడంతో ఆయన కూడా తన రాజకీయ భవిష్యత్ పై ఆలోచనలో పడ్డారు. దాంతో జనసేన పార్టీలో చేరాలని భావించినట్లున్నారు. రెండు సార్లు పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కానీ జనసేనలో మాత్రం చేరలేదు. 

గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసిన వారిలో ఒక్కరు మాత్రమే విజయం సాధించారు. జనసేన పార్టీలో చేరితే ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన సన్నిహితులు వారించినట్లు సమాచారం. 

గతంలో ప్రజారాజ్యం పార్టీలో చేరినప్పుడు కూడా వంగవీటి రాధాకృష్ణపై కులముద్ర పడిందని ఆయన అభిమానులు సూచిస్తున్నారట. అందువల్లే ఓటమి పాలయ్యారని సూచించారట. ఇదే తరుణంలో జనసేన పార్టీలో చేరితే అలాంటి పరిస్థితే ఎదురవుతుందని ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగానే మిగిలిపోతారని కొందరు సూచించినట్లు తెలుస్తోంది. 

జనసేన గూటికి వంగవీటి రాధాకృష్ణ: దిండిలో పవన్ తో భేటీ

ఈ పరిణామాల నేపథ్యంలో జనసేన పార్టీలో చేరే అంశంపై కూడా పునరాలోచనలో పడ్డారట వంగవీటి రాధాకృష్ణ. వంగవీటి మోహన్ రంగా ఆశయమైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలన్న సంకల్పం నెరవేరాలంటే రాధా వైసీపీలో చేరితేనే మంచిదని భావిస్తున్నారట. 

అయితే అందుకు వంగవీటి రాధా సుముఖంగా లేరని తెలుస్తోంది. గతంలో వైసీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఆ నేపథ్యంలో వెళ్లేందుకు అహం అడ్డొస్తుందని తెలుస్తోంది. ఇకపోతే వంగవీటి రాధాకృష్ణ దగ్గర నుంచి పార్టీ మార్పుకు సంబంధించి ఏవైనా సంకేతాలు వెలువడితే వైసీపీలో చేర్చుకునేందుకు వైసీపీ వ్యూహం రచిస్తోందని తెలుస్తోంది. 
 
త్వరలో స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వంగవీటి రాధా వైసీపీలో చేరితే పార్టీకి మరింత బలం చేకూరుతుందని వైసీపీ కూడా భావిస్తోందట. అయితే వంశీ ఎపిసోడ్ ఓ కొలిక్కివస్తే నెక్స్ట్ ఆపరేష్ వంగవీటి రాధాకృష్ణే అని తెలుస్తోంది. 

తన మిత్రుడు అయిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఎపిసోడ్ ను ఓ కొలిక్కి తెస్తే వంగవీటి రాధాను పార్టీలో తీసుకు వచ్చే భారాన్ని కూడా మంత్రి కొడాలి నాని తన భుజ స్కందాలపై వేసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

అటో ఇటో ఏదో తేల్చండి: సీఎం జగన్ తో వంశీ భేటీ

ఇదే టాపిక్ పై కృష్ణా జిల్లాలో జోరుగా చర్చ సాగుతోందట. ముగ్గురు మిత్రులు వైసీపీలో చేరితో బెజవాడ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదంతా సీఎం జగన్ ఇచ్చే హామీపైనే ఉంటుందని కూడా తెలుస్తోంది.