Asianet News TeluguAsianet News Telugu

మూణ్ణాళ్ల ముచ్చటేనా : గంజి చిరంజీవికి జగన్ షాక్, మంగళగిరి వైసీపీ అభ్యర్ధిగా కాండ్రు కమల..?

ఆంధ్రప్రదేశ్‌లోని కీలక నియోజకవర్గాల్లో ఒకటైన మంగళగిరిలో అభ్యర్ధిని మార్చాలని ఏపీ సీఎం , వైసీపీ అధినేత వైఎస్ డిసైడ్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. గంజి చిరంజీవి ప్లేస్‌లో మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలను నియమించాలని జగన్ భావిస్తున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. 

ganji chiranjeevi : ap cm ys jagan to change mangalagiri ycp incharge ksp
Author
First Published Feb 15, 2024, 3:00 PM IST | Last Updated Feb 15, 2024, 3:01 PM IST

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడటంతో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. కీలక నేతలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలైన కుప్పం, పులివెందుల, మంగళగిరి, హిందూపురం, భీమవరం, గాజువాకలపై పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. వీటిలో మంగళగిరి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక్కడ రెండు సార్లు వైసీపీ నుంచి గెలిచి జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డ ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) వైసీపీని వీడటం దుమారం రేపింది. నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పుకు ముందే ఆర్కే పార్టీని వీడటం వైసీపీ వర్గాలను సైతం విస్మయానికి గురిచేశాయి. 

ఇక్కడ టీడీపీ నుంచి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బరిలో దిగారు. 2019లో ఆర్కే చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైన చినబాబు.. ఈసారి మాత్రం విజయం సాధించాలని గట్టి పట్టుదలగా వున్నారు. 2019లో ఓడిననాటి నుంచి నియోజకవర్గంలో ప్రజలతోనే మమేకం అవుతూ వస్తున్నారు. వైసీపీపై పోరాటంతో పాటు ఏ సమస్య వచ్చినా తానున్నాననే భరోసా ఇస్తున్నారు. మరోసారి లోకేష్‌ను ఓడించాలని సీఎం వైఎస్ జగన్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. 2014, 2019లలో ఇక్కడి నుంచి వైసీపీ తరపున ఆళ్ల ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు, 2024లోనూ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఆయన గట్టి పట్టుదలగా వున్న సమయంలో ఇన్‌ఛార్జ్‌ల మార్పు వ్యవహారం.. జగన్‌తో ఆర్కే‌కి గ్యాప్ తెచ్చింది. ఈ క్రమంలోనే ఆయన వైసీపీకి , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 

ఆర్కే పార్టీని వీడటంతో వెంటనే స్థానికుడు, పద్మశాలి సామాజికవర్గానికి చెందిన గంజి చిరంజీవిని జగన్ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు . తద్వారా మంగళగిరిలో పెద్ద సంఖ్యలో వున్న పద్మశాలి, ఇతర బీసీ ఓట్లు వైసీపీకేనని .. దీనికి తోడు పార్టీని తొలి నుంచి అంటిపెట్టుకుని వున్న రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ఓట్లు తమకే పడతాయని జగన్ అంచనాలో వేస్తున్నారు. చిరంజీవి సైతం తన పని తాను చేసుకుంటూ.. నియోజకవర్గంలో ఆల్రెడీ ప్రచారం సైతం ప్రారంభించారు. ఇప్పటికే మంగళగిరి వైసీపీ ఆర్కే, చిరంజీవి, దొంతిరెడ్డి గ్రూపులుగా విడిపోయింది. అయినప్పటికీ చిరంజీవి దూకుడుగానే ముందుకు వెళ్తున్నారు.

ఇలాంటి దశలో గంజి చిరంజీవికి జగన్ షాక్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. చిరంజీవి ప్లేస్‌లో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలను నియమించినట్లుగా ప్రచారం జరుగుతోంది. జగన్ చేయించిన సర్వేలో చిరంజీవి పరిస్ధితి ఏమాత్రం బాలేదని.. లోకేష్‌ను ఓడించే పరిస్ధితులు కనిపించడం లేదని తేలడంతో వైసీపీ చీఫ్ పునరాలోచనలో పడ్డట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కమలను తెరపైకి తెచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. మంగళగిరిలో బలంగా వున్న పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన కాండ్రు కమల కాంగ్రెస్ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 

మంగళగిరి మున్సిపల్ ఛైర్మన్‌‌గా, ఎమ్మెల్యేగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావడంతో ఆమె రాజకీయాలకు దూరంగా వుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీలో చేరి టికెట్ ఆశించారు. అయితే అధిష్టానం మంగళగిరి సీటును నారా లోకేష్‌కు కన్ఫర్మ్ చేయడంతో కమల నిరాశకు లోనయ్యారు. అయితే 2019 ఎన్నికలకు కొద్దిరోజుల ముందు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అప్పటి నుంచి ఆమె అధికార పార్టీలోనే కొనసాగుతున్నారు. కానీ ఏ కార్యక్రమానికి కమల హాజరుకావడం లేదు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావుకు ఆమె స్వయానా వియ్యపురాలు. అన్ని రకాలుగా ఆలోచించే జగన్ .. కాండ్రు కమల అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios