గంగుల ప్రతాప్‌ రెడ్డికి సొంతమనుషులే షాక్ ఇచ్చారు. మీటింగ్ కోసం ఫోన్ చేసి అనుచరులను పిలిచిన ప్రతాప్ రెడ్డి. గుంగుల ప్రతాప రెడ్డితో ఫోన్ లోనే రాలేమని సమాధానం. ఎం చేయ్యాలో అర్థంకాక తికమక పడుతున్న గంగుల.

టీడీపీలో చేరిన గంగుల ప్రతాప్‌ రెడ్డికి సొంతమనుషులే షాక్ ఇచ్చారు. రెండు రోజుల క్రితమే ఆళ్ళగడ్డకు చెందిన గంగుల ప్రతాప్ రెడ్డి టిడిపిలో చేరిన సంగతి తెలిసిందే. ఉపఎన్నికకు ముందు ఓ పెద్ద రెడ్డి నేతను టిడిపిలోకి చేర్చుకోవాలన్న ఉబలాటం కూడా ప్రతాప్ రెడ్డి చేరికతో పూర్తయింది, గంగుల ఇపుడు నంద్యాల టిడిపి అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డి విజయానికి ఏ విధంగా ఉపయోగపడతారో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఎందుకంటే, పార్టీలో చేరిన సందర్భంగా భూమా విజయంలో తన సత్తా ఏంటో చూపిస్తానని చంద్రబాబునాయుడుకు హామీ ఇచ్చినట్లు సమాచారం.


 మరి హామీ ఇచ్చినట్లుగా గంగుల సత్తా చూపటంపై తాజా పరిణామాలతో అనుమానం మొదలైంది. టీడీపీలో చేరిన తర్వాత ప్రతాపరెడ్డి ఆళ్లగడ్డకు చేరుకున్నారు. రాత్రికి రాత్రే ముఖ్య అనుచరులతో సమావేశమవుదామని అనుకున్నారు. అనుకన్నదే తడవుగా వెంటనే అందరికీ తన ఇంటికి రావాల్సిందిగా సమాచారం కూడా పంపారు. అయితే ఇక్కడే సమస్య మొదలైందట. స్వయంగా ప్రతాపరెడ్డే ఫోన్ చేసి ఆహ్వానించినా ఒక్కరంటే ఒక్కరు కూడా రాలేదట. అందులో ఒకరిద్దరు ఫోన్లోనే గంగులతో తాము ఎందుకు రాలేకపోతున్నామో కూడా చెప్పారట. దాంతో గంగులకు దిమ్మతిరిగినట్లైందట.

భూమా కుటుంబంపై చేసిన పోరాటంలో తమ ఆస్తులతో పాటు ప్రాణాలను కూడా ఫణంగా పెట్టిన విషయాన్ని గుర్తుచేసారట. అదే విషయాన్ని చెబతుతూ ‘ మీ అంతట మీరెళ్ళి చంద్రబాబుతో మాట్లాడుకుని టిడిపిలో చేరిపోతే తాము ఎలా వస్తామని అనుకున్నారు’ అంటూ నిలదీసారట. భూమా కుటుంబంపై చేసిన పోరాటంలో 30 ఏళ్ళలో ప్రాణాలతో పాటు ఆస్తులను కూడా పోగొట్టుకున్న విషయాన్ని మరచిపోయారా... అంటూ నిలదీసారట. 
‘మీ అవసరానికి మీరెళ్లి టిడిపిలో చేరిపోతే తాము రావాలా’? అంటూ ప్రశ్నించారట. ఎట్టి పరిస్ధితిల్లోనూ తాము టిడిపి అభ్యర్ధి గెలుపుకు సహకరించేది లేదంటూ ప్రతాప్ రెడ్డి అనుచరులు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారట. ‘తామంతా గంగుల ప్రభాకర్ రెడ్డితో వైసీపీలోనే ఉంటామని, మరోసారి తమను పిలవద్ద’ని కూడా ఖచ్చితంగా చెప్పారట. ముఖ్య అనుచరుల నుండి వచ్చిన సమాధానంతో ఏం చేయాలో ప్రతాపరెడ్డికి అర్ధం కావటం లేదట.