కడప జిల్లా కొండాపురం మండలం తాళ్ల ప్రొద్దుటూరులో గురువారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. గండికోట రిజర్వాయర్ లో 23 టీఎంసీల నీరు నిల్వ ఉంచి, ముంపు గ్రామాలను ఖాళీ చేయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

సర్కార్ ఆదేశాల మేరకు నిర్వాసితులను ఇళ్లు ఖాళీ చేసి వెళ్లాలంటూ అధికారుల ఒత్తిడి తీసుకొచ్చారు. ముంపు గ్రామాల్లో మకాం వేసి మరి రెవెన్యూ అధికారులు గ్రామస్తులను ఖాళీ చేయిస్తున్నారు.

అయితే తమకు పరిహారం అందించాకే ఇళ్లు ఖాళీ చేస్తామంటూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు నిర్వాసితులను బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు.

దీంతో  అధికారులు, పోలీసులను అడ్డుకుని నిర్వాసితులు వారితో వాగ్వాదానికి దిగారు. పరిహారం పూర్తిగా చెల్లించాకే ఖాళీ చేస్తామని జనం కూడా పట్టుదలతో ఉండటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.