విజయవాడ: తన తల్లి గల్లా అరుణ కుమారి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలిగా నియమితులు కావడంపై పార్టీ పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ స్పందించారు. ఆ రాజకీయాల నుంచి తప్పుకునే విషయంపై కూడా ఆయన ట్విట్టర్ లో స్పందించారు. 

పోలిట్ బ్యూరో సభ్యురాలిగా నియమితులు కావడంపై తల్లికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ పార్టీకి, ప్రజలకు సేవ చేసిన తన తల్లి ప్రత్యక్ష రాజకీయాలకు మాత్రమే రిటైర్మెంట్ ప్రకటించారని, రాజకీయాలకు కాదని ఆయన అన్నారు. 30 ఏళ్ల ఆమె అనుభవం పొలిట్ బ్యూరో ద్వారా పార్టీకి ఉపయోగపడుతుందని గల్లా జయదేవ్ అన్నారు.

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఇన్‌చార్జి పదవి నుంచి తనను తప్పించాలని ఆమె ఇంతకు ముందు సీఎం చంద్రబాబును కోరిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని కూడా చంద్రబాబుకు ఆమె చెప్పారు.